Begin typing your search above and press return to search.

నాయుడిగారి ఆస్తులు పంచుకోలేదంట!

By:  Tupaki Desk   |   1 Aug 2016 8:13 AM GMT
నాయుడిగారి ఆస్తులు పంచుకోలేదంట!
X
ఇద్ద‌రు కొడుకులు ఉన్నారంటే.. వారి ఇద్ద‌రి కోస‌మూ ఆస్తులు సంపాదించాల‌ని ఏ తండ్రైనా త‌ప‌న ప‌డ‌తాడు క‌దా. పిల్ల‌ల్ని పెంచి పెద్ద చేసి - విద్యాబుద్ధులు చెప్పించి - ఇద్ద‌రికీ పెళ్లి చేసిన వెంట‌నే ఆస్తుల్ని పంచేస్తాడు. ఎవ‌రి బాధ్య‌త‌లు వారికి ఇచ్చేస్తాడు. చిన్నాపెద్దా అని తార‌త‌మ్యాలు లేకుండా అంద‌రి కుటుంబాల్లోనూ అన్న‌ద‌మ్ములు వేరుప‌డ‌టం అనేది రొటీన్ ప్రాసెస్. అయితే - ప్ర‌ముఖ నిర్మాత డి. రామానాయుడి కుమారులు మాత్రం ఇంకా ఆస్తుల పంప‌కాలు చేసుకోలేదు! తండ్రి ఇచ్చిన ఆస్తుల్ని ఇంకా స‌మ‌ష్టిగానే చూసుకుంటున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా చెప్పారు ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు.

‘నేనూ వెంకటేష్ ఎప్ప‌డూ క‌లిసి క‌ట్టుగానే ఉంటాం. చిన్న‌ప్ప‌టి నుంచీ మా మ‌ధ్య ఒక‌ర‌క‌మైన అవ‌గాహ‌న కుదిరింది. అన్న‌య్య కాబ‌ట్టి... నేను పెద్ద‌ - వాడు చిన్న అనే భావ‌న మా మ‌ధ్య ఎప్పుడూ ఉండ‌దు. మా ఇద్ద‌రికీ ఒక‌రంటే ఒక‌రికి ఎంతో గౌర‌వం. ఒక‌రి మాట‌కు ఒక‌రం విలువ ఇచ్చుకుంటాం. ఇప్ప‌టికీ పేర్లు పెట్టే పిలుచుకుంటాం. ఒక‌రి అవ‌స‌రాలు ఒక‌రు అర్థం చేసుకుంటాం. అలానే, వాడికి న‌చ్చ‌ని ప‌ని నేను చేయ‌ను.. నాకు న‌చ్చ‌నిది వాడూ చేయ‌డు. ఇక‌, ఆస్తుల విష‌యానికొస్తే... నా పెళ్ల‌యిన కొత్త‌లోనే ఆస్తుల్ని వాటాలు వేసేస్తామ‌ని నాన్న‌గారు అన్నారు. కానీ, మేమిద్ద‌రం వ‌ద్ద‌న్నాం. క‌లిసే ఉంటామ‌ని చెప్పాం. అలానే ఉంటున్నాం. వాడికో సొంత ఇల్లు ఉంది. నాకూ ఓ సొంత ఇల్లు ఉంది. అంతే... ఇక మిగ‌తాదంతా మా ఇద్ద‌రి ఉమ్మ‌డి ఆస్తులు.. అంతే’ అని వివ‌రించారు సురేష్‌ బాబు.

సోద‌రుడు వెంక‌టేష్‌ కు ఆధ్యాత్మిక చింత‌న ఎక్కువ అని సురేష్‌ బాబు చెప్పారు. ఇన్నాళ్లూ కష్ట‌ప‌డింది చాలు, ఇక‌నైనా విశ్రాంతి తీసుకుందాం ప‌ని త‌గ్గించుకో అని స‌ల‌హా ఇస్తుంటార‌ని చెప్పారు. ఇక‌, త‌న కుమారుడు రానా కెరీర్ గురించి తానెప్పుడూ ఆలోచించ‌లేద‌నీ, సొంతంగా క‌ష్ట‌ప‌డి త‌న‌కు తానే గుర్తింపు సాధించుకున్నాడు అన్నారు. చిన్న కుమారుడు అభిరామ్ గురించి మాట్లాడుతూ... వాడి కెరీర్ వాడిష్టం - వాడికి ఏది న‌చ్చితే ఆ ప‌ని చేయ‌మంటూ స‌పోర్ట్ చేస్తా అన్నారు సురేష్‌ బాబు. ఏదేమైనా, వీసానికే విరిగిపోయే కుటుంబాలున్న ఈ రోజుల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఆస్తులు పంచుకోని అన్న‌ద‌మ్ములుగా క‌లిసిమెలిసి ఉంటున్నారంటే గ్రేట్‌!