Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ శాతకర్ణి.. వెంకటేష్ పులోమావి!

By:  Tupaki Desk   |   26 Dec 2016 7:30 AM GMT
ఎన్టీఆర్ శాతకర్ణి.. వెంకటేష్ పులోమావి!
X
చరిత్రలో ఎంతోమంది చక్రవర్తుల గురించి విన్నాం. చదువుకున్నాం. కానీ ఆ చక్రవర్తుల కంటే ఎంతో గొప్పవాడైన గౌతమీపుత్ర శాతకర్ణి గురించి మాత్రం జనాలకు తెలిసింది తక్కువ. తెలుగులో ఎన్నో చారిత్రక గాథలతో సినిమాలు తెరకెక్కాయి. కానీ శాతకర్ణి గురించి ఇప్పుడు క్రిష్-బాలయ్య కలిసి సినిమా తీసేదాకా మరే సినిమా రాకపోవడం ఆశ్చర్యమే. ఇలాంటి చారిత్రక సినిమాలు ఎన్నో చేసిన సీనియర్ ఎన్టీఆర్ సైతం శాతకర్ణి సినిమా చేయకపోవడమూ మింగుడు పడని విషయమే. ఐతే నిజానికి ఎన్టీఆర్ శాతకర్ణి సినిమా చేయడానికి ఒక సమయంలో చాలా పట్టుదలగా ఉన్నారట. అందుకోసం సన్నాహాలు కూడా చేశారట. విశేషం ఏంటంటే.. ఇందులో శాతకర్ణి కొడుకు పులోమావి పాత్రను విక్టరీ వెంకటేష్ తో చేయించాలని కూడా చూశారట.

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచస్థాయికి తీసుకువెళ్లిన చక్రవర్తి అయిన గౌతమీపుత్ర శాతకర్ణి కథను తెరపై చూపించాలన్న నిర్ణయం ‘శ్రీనాథ కవి సార్వభౌమ’ తర్వాత తీసుకున్నారట ఎన్టీఆర్. ప్రముఖ సినీ పాత్రికేయుడు ప్రదీప్.. ప్రసాద్‌ అనే యాడ్‌ ఫిల్మ్‌ మేకర్ తో కలిసి ఎన్టీఆర్ 110 సీన్లతో స్ర్కిప్టును కూడా తయారు చేశారట. ఆ సమయంలో వెంకటేష్.. ఎన్టీఆర్ ను కలిసి మీతో ఓ సినిమా చేయాలని ఉందని ప్రస్తావించగా.. శాతకర్ణి కుమారుడు పులోమావిగా వెంకటేష్‌ ఎలా ఉంటారో చూద్దామంటూ ఎన్టీఆర్ కొన్ని స్కెచ్ లు కూడా గీయించారట. మరోవైపు ఆ చిత్రానికి అవసరమైన ఆభరణాలు.. ఆయుధాల సంబంధించి డిజైన్లు కూడా గీయించారట ఎన్టీఆర్. నే ఏలుతాలే ఈ భువన సీమను అంటూ ఓ పాట కూడా రాయించారట ఎన్టీఆర్. కొన్ని పాటల రికార్డింగ్ కూడా జరిగిందట. ఐతే అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నెమ్మదించడం.. ఎన్టీఆర్ సినిమాల మీద పూర్తిగా దృష్టిసారించడంతో మళ్లీ ఈ సినిమా ముందుకు వెళ్లలేదని సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/