Begin typing your search above and press return to search.
వెంకీ స్టయిల్ మారుస్తాడా?
By: Tupaki Desk | 28 Feb 2018 4:57 AM GMTవిక్టరీ వెంకటేష్ ఈమధ్య సినిమాలకు కాస్త విరామమిచ్చాడు. చివరిగా వెంకటేష్ గురు సినిమాలో కనిపించాడు. హిందీ మూవీ సాలాఖడూస్ కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ కోచ్ పాత్రలో కనిపించాడు. ఆ తరవాత ఇంతవరకు ఆయన కొత్త సినిమా ఏదీ షూటింగ్ ప్రారంభమే కాలేదు. చాలా స్క్రిప్టులు విన్నాక చివరకు ‘‘నేనే రాజు.. నేనే మంత్రి’’ సినిమాతో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చిన తేజతో సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపాడు.
వెంకటేష్ తో చేసే సినిమాకు సంబంధించి తేజ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు. ఈ సినిమాలో వెంకటేష్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీలో వెంకీని ఇంతకుముందు చూసిన విధంగా కాకుండా ఓ కొత్త లుక్ లో చూపించాలని తేజ అనుకుంటున్నాడట. వెంకటేష్ సినిమాల్లో చాలావరకు క్లీన్ షేవ్ తోనే కనిపించాడు. అందుకే ఈ సినిమా కోసం కాస్త గడ్డంతో చూపించాలని ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. గురు సినిమాలో కూడా వెంకీ గడ్డంతో కనిపించినా అది రఫ్ అండ్ టఫ్ పాత్ర. ఇందులో లెక్చరర్ కావడంతో హుందాగా కనిపించాల్సి ఉంటుంది. అందుకే కాస్త మెచ్యూరిటీ.. సీరియస్ నెస్ రెండూ కనిపించేలా కొత్త గెటప్ లో చూపించడంపై డిస్కషన్లు చేస్తున్నారు.
నేనే రాజు.. నేనే మంత్రి సినిమా డైరెక్టర్ గా తేజకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా వచ్చాకే బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవితగాథతో తీయబోయే సినిమాకు తేజను డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నాడు. వెంకటేష్ కూడా ఆ మూవీ డీల్ చేసిన తీరుకే ఇంప్రెస్ అయి అతడితో తరవాత సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. వెంకీ సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు.