Begin typing your search above and press return to search.

వెంకీ ఇంకో దృశ్యం చేయబోతున్నాడు

By:  Tupaki Desk   |   14 Dec 2015 7:30 PM GMT
వెంకీ ఇంకో దృశ్యం చేయబోతున్నాడు
X
ట్రెండుకు తగ్గట్లు మారకపోతే ఏ హీరోకైనా మనుగడ కష్టమే. విక్టరీ వెంకటేష్ కు కొన్నేళ్ల కిందటే ఈ సంగతి బోధపడింది. అందుకే మల్టీస్టారర్లు చేయడానికి.. మిడిలేజ్డ్ క్యారెక్టర్లు చేయడానికి తయారైపోయాడు. మామూలుగా మన తెలుగు హీరోల నైజం ప్రకారం అయితే.. వయసుకొచ్చిన ఆడ పిల్ల తండ్రిగా నటించడానికి ఎవ్వరూ ఒప్పుకోరు. కానీ వెంకీ ‘దృశ్యం’ సినిమాలో ఆ తరహా పాత్రలో నటించి సరికొత్త ట్రెండుకు తెర తీశారు. ఆయన వేసిన బోల్డ్ స్టెప్ మంచి ఫలితాన్నే ఇచ్చింది. ‘దృశ్యం’ వెంకీ కెరీర్లో ఓ స్పెషల్ మూవీగా నిలిచింది. విక్టరీ హీరో నుంచి అభిమానులు కూడా ఈ తరహా పాత్రలే ఆశిస్తున్నారు. వెంకీ కూడా ఇలాంటి మంచి క్యారెక్టర్లు చేయడానికి ఆసక్తిగానే ఉన్నాడు.

ఈ నేపథ్యంలో ‘దృశ్యం’ ఒరిజినల్ మూవీని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్‌ తో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఆ మధ్య తన కొత్త సినిమాల స్క్రిప్టు చర్చల కోసం కొన్ని రోజులు కేరళలో గడిపి వచ్చిన వెంకీ.. ఆ సమయంలోనే జీతును కలిసినట్లు తెలిసింది. ఇద్దరి మధ్య ఓ కథ చర్చకు వచ్చిందని.. ఆ కథతోనే వెంకీ వచ్చే ఏడాది జీతు దర్శకత్వంలో సినిమా చేయొచ్చని అంటున్నారు. వెంకీ ప్రస్తుతం మారుతితో ‘బాబు బంగారం’ మొదలెట్టే పనిలో ఉన్నాడు. మారుతి స్పీడు సంగతి తెలిసిందే. మూణ్నాలుగు నెలల్లో మంచి క్వాలిటీతో సినిమా తీసి పెట్టేయగలడు. అంటే వచ్చే వేసవికల్లా వెంకీ ఫ్రీ అయిపోతాడు. అప్పుడే వెంకీ - జీతు కాంబినేషన్ లో సినిమా తెరపైకి వచ్చే అవకాశముంది. చూద్దాం ‘దృశ్యం’ డైరెక్టర్ వెంకీతో ఎలాంటి సినిమా తీస్తాడో?