Begin typing your search above and press return to search.

విక్టరీ వెంకటేష్ దమ్మున్న స్టేట్మెంట్

By:  Tupaki Desk   |   9 Aug 2016 11:00 AM GMT
విక్టరీ వెంకటేష్ దమ్మున్న స్టేట్మెంట్
X
మన దగ్గర హీరోయిన్లకు రిటైర్మెంట్ ఉంటుంది కానీ.. హీరోలకు ఉండదు. ఎన్నేళ్లు వచ్చినా కుర్రాళ్ల పాత్రలే చేస్తారు మన స్టార్ హీరోలు. తెరమీద అలాంటి పాత్రలు చేయడమే కాదు.. బయట కూడా ‘కుర్ర’ కబుర్లే చెబుతుంటారు. వయసు ప్రస్తావన తేవడానికి అస్సలు ఇష్టపడరు. వయసుకు తగ్గ పాత్రలు అనే మాటే చాలామంది వయసుమళ్లిన స్టార్ హీరోల నోట రాదు. ఐతే వెంకటేష్ మాత్రం ఈ తరహా కాదు. తెరమీద వయసుకెదిగిన పిల్లల తండ్రిగా మిడిలేజ్డ్ క్యారెక్టర్లలో కనిపించడమే కాదు.. బయట కూడా వయసు గురించి.. ఓపెన్ గా మాట్లాడేస్తున్నాడు. ‘‘నేను స్టార్ హీరో కాదు.. సీనియర్ హీరో’’ అంటూ దమ్మున్న స్టేట్మెంట్ ఇచ్చాడు వెంకీ. ఇలాగే ఓపెన్ గా ఇంకా కొన్ని మంచి విషయాలు చెప్పాడు వెంకీ. ఆ ముచ్చట్లేంటో చూద్దా పదండి.

‘‘కెరీర్లో ఒక స్టేజ్ వచ్చాక మంచి స్క్రిప్టులు రావడం కూడా కష్టమే. మన గురించి మనం పున:సమీక్షించుకోవాలి. వయసైపోతోందనే విషయాన్ని కచ్చితంగా ఒప్పుకోవాలి. ప్రతి పాత్రనూ మనమే చేయాలనుకోకూడదు. మన వయసుకు తగ్గ పాత్రల్ని ఎంచుకోవాలి. యంగ్ డైరెక్టర్లు కొంతమంది వాళ్ల వయసుకు తగ్గ ఆలోచనలతో స్క్రిప్టులు తయారు చేసుకుంటారు. అలాంటి పాత్రలకు యువ హీరోలు మాత్రమే సూటవుతారు. వాళ్లను వచ్చి నాతో పని చేయమని అడగలేను. కానీ వాళ్లంతట వాళ్లొచ్చి నాకు తగ్గ సినిమా చేస్తానంటే రెడీ. సీనియర్ హీరోలకు హీరోయిన్ల సమస్య ఉన్న మాట వాస్తవం. ఒకప్పుడు కొత్త హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాం. కానీ ఇప్పుడున్నది వేరే స్టేజ్. వెతుక్కోవాలి. ఇక ఈ వయసులో నేను హీరోయిన్ల వెంట పరుగెత్తుతూ కనిపిస్తే ప్రేక్షకులు నవ్వుతారు. డ్యాన్సులు కూడా వయసుకు తగ్గట్లుగా ఉండాలి. పాముల్లాగా మెలికలు తిరుగుతూ డ్యాన్సులు చేస్తే బాగోదు. నేను ఇండస్ట్రీలోకి వచ్చి 30 ఏళ్లయింది. ఇంకా నా మొహం స్క్రీన్ మీద చూడటంలో జనాలకు ఆసక్తి పోనందుకు సంతోషం. ఐతే 30 ఏళ్లు అన్నది ఓ నంబర్ మాత్రమే. దాని గురించిపట్టించుకోను’’ అని వెంకీ అన్నాడు.