Begin typing your search above and press return to search.

వెంకీ మాట: 30 ఏళ్లు పీకిందేమీ లేదు

By:  Tupaki Desk   |   25 July 2016 5:02 AM GMT
వెంకీ మాట: 30 ఏళ్లు పీకిందేమీ లేదు
X
ఆగస్టు 14తో 30 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నాడు విక్టరీ వెంకటేష్. ఈ నేపథ్యంలో ‘బాబు బంగారం’ సినిమా విడుదల కాబోతోంది. ఇది చాలా ప్రత్యేకమైన సినిమా కాబట్టి ఆడియో వేడుకలో ఒక స్పెషల్ స్పీచ్ ఇవ్వమని.. దాని కోసం ప్రిపేరవ్వమని తనకు కొందరు సలహా ఇచ్చారని.. కాకపోతే తనకది అలవాటు లేని విషయం కాబట్టి అలా చేయలేదని.. చెబుతూ.. ‘‘30 ఏళ్లు పీకిందేమీ లేదు’’ అంటూ సర్ప్రైజింగ్ కామెంట్ చేశాడు వెంకీ. ‘బాబు బంగారం’ ఆడియో వేడుకలో వెంకీ ఇంకా ఏమన్నాడంటే..

‘‘సినిమాల్లో ఏదో చేసేస్తుంటా కానీ.. వేదికల మీద మాట్లాడ్డం రాదు. మామూలుగానే మాట్లాడలేనంటే.. ఇక ప్రిపేరైతే అసలేం మాట్లాడలేను. స్పీచ్ ప్రిపేరవమని అంటే.. 30 ఏళ్లుగా పీకిందేమీ లేదు.. కొత్తగా ఏం చేస్తాంలే అన్నాను. ఇలాంటి వేడుకలకు వచ్చేది కేవలం అభిమానుల ప్రేమ.. వారి కళ్లల్లో ఆనందం కోసమే. 30 ఏళ్లు ఎలా పూర్తయ్యాయో అర్థం కావడం లేదు. ఇన్నేళ్లుగా నటిస్తున్నాం. ఇక కొంచెం సినిమాలు తగ్గిద్దాం అనుకుంటే ఉండేవాడిని. కానీ మారుతి చేసిన ‘బాబు బంగారం’ ట్రైలర్ చూస్తూ అదనంగా నాకు ఇంకో 15 ఏళ్ల కెరీర్ ఇచ్చాడు. ఇంకా పదేళ్లో ఇరవై ఏళ్లో నటిస్తూనే ఉంటా. మా అబ్బాయి అర్జున్ వచ్చే వరకు కూడా సినిమాలు చేస్తుంటా. నన్ను ఇక పెళ్లి కాని ప్రసాద్ అంటారో.. లేక బాబు బంగారం అంటారో ప్రేక్షకులే చెప్పాలి. బొబ్బిలి రాజా.. చంటి.. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు.. గోపాల గోపాల.. తర్వాత ‘బాబు బంగారం’ కూడా ప్రత్యేకమైన సినిమా’’ అని వెంకీ చెప్పాడు.