Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'వెంకీ మామ'

By:  Tupaki Desk   |   13 Dec 2019 8:14 AM GMT
మూవీ రివ్యూ : వెంకీ మామ
X
చిత్రం : 'వెంకీ మామ'

నటీనటులు: వెంకటేష్ - నాగచైతన్య - రాశి ఖన్నా - పాయల్ రాజ్‌ పుత్ - ప్రకాష్ రాజ్ - నాజర్ - రావు రమేష్ - ఆదిత్య మీనన్ - కిషోర్ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల
నిర్మాత: సురేష్ బాబు
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: బాబీ (కె.ఎస్.రవీంద్ర)

మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్.. అక్కినేని నాగచైతన్యల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘వెంకీ మామ’. ముందు నుంచే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉండగా.. టీజర్ - ట్రైలర్ అంచనాల్ని మరింత పెంచాయి. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆ అంచనాల్ని ఏమేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ:

వెంకటరత్నం నాయుడు (వెంకటేష్) కోస్తా ప్రాంతంలోని ఓ పల్లెటూరిలో మోతుబరి. చిన్నపుడే తన తల్లిదండ్రుల్ని కోల్పోయిన మేనల్లుడు కార్తీక్ (నాగచైతన్య) కోసం మిలిటరీలో ఉద్యోగం వదులుకోవడమే కాదు.. అతడి కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోతాడు. ఈ మామా అల్లుళ్లు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పంచ ప్రాణాలు. తన కోసం పెళ్లి చేసుకోని మావయ్యకు అమ్మాయిని సెట్ చేయాలని.. తన కోసం ప్రేమను త్యాగం చేసిన మేనల్లుడిని మళ్లీ తన ప్రేయసితో కలపాలని ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయత్నంలో విజయవంతం అవుతారు కూడా. కానీ ఇంతలో అనూహ్య పరిణామాల మధ్య కార్తీక్.. తన మావయ్యకు చెప్పకుండా ఆర్మీకి వెళ్లిపోతాడు కార్తీక్. మూడేళ్లు గడిచినా తిరిగి రాడు. అతనంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి.. ఆ కారణమేంటో తెలిసిన వెంకటరత్నం నాయుడు ఏం చేశాడో.. ఈ మామా అల్లుళ్లు మళ్లీ కలుసుకున్నారా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

చిన్నపుడే తల్లిదండ్రులు కోల్పోయిన మేనల్లుడిని తెచ్చి మావయ్య అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. అతడి కోసం పెళ్లి కూడా మానుకుంటాడు. తన మేనల్లుడిని మావయ్య అంతగా ప్రేమిస్తుంటే.. అతడి తండ్రి మాత్రం మనవడిని అసహ్యించుకుంటూ ఉంటాడు. మామా అల్లుళ్లను విడదీయడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తుంటాడు. ఇందుకు కారణమేంటయ్యా అంటే.. తన మనవడు పుట్టగానే జాతకం చూపిస్తే అతడిది శ్రీకృష్ణుడిని పోలిన జాతకమట. అతడి వల్ల మామకు ప్రాణ గండం ఉందట. మనవడికి 24 ఏళ్లు నిండగానే అతడి వల్ల తన కొడుకు ప్రాణం పోతుందని భయపడి అతణ్ని దూరంగా పంపేయాలని చూస్తుంటాడు. ఆయన చెప్పినట్లే తన వల్ల మావయ్యకు ఒకట్రెండుసార్లు ప్రమాదం జరగడంతో మేనల్లుడు.. మావయ్యను వదిలేసి దూరంగా వెళ్లిపోతాడు. ఇదీ ‘సెంటిమెంటు’ నిండిన ‘వెంకీ మామ’ కథ. దీన్ని బట్టే ఇది ఏ ‘కాలం’ నాటి సినిమానో.. దీని నడత ఎలా ఉంటుందో ఒక అంచనాకు రావచ్చు.

రామానాయుడు కలలుగన్న వెంకీ-చైతూ కాంబినేషన్లో సినిమా కోసం పదేళ్లకు పైగా వెతికి వెతికి సురేష్ బాబు ఇలాంటి ముతక కథను ఎంచుకోవడమే ఆశ్చర్యం. అసలే పాత కాలం నాటి కథ.. రొటీన్ కమర్షియల్ సినిమాలు తీస్తాడని పేరున్న బాబీ చేతిలో దాన్ని పెట్టారు. ఇంకేముంది.. ఎన్నోసార్లు చూసిన మసాలా సినిమాల్లాగే తయారైంది ‘వెంకీ మామ’. భూతద్దం వేసి వెతికినా ఇందులో కొత్తదనం అన్నది కనిపించదు. పోనీ ‘సోగ్గాడే చిన్నినాయనా’లో మాదిరి ‘ఆత్మ’తో ముడిపడ్డ సినిమా అయినా.. ఈ జాతకాల్లాంటి అంశాల్ని తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ ఓవైపు టెర్రరిస్టుల మీద ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ మీద ఒక ట్రాక్ నడిపించి.. ఇంకోవైపు జాతకాల సెంటిమెంటు చుట్టూ మూల కథను నడిపితే ఎక్కడ సింక్ అవుతుంది? వినోదం అయినా అనుకున్న స్థాయిలో పండి ఉంటే మిగతా లోపాలు మరుగున పడిపోయేవి. అదీ జరగలేదు. ‘ఎఫ్-2’ తర్వాత వెంకీ మరోసారి ఉత్సాహంగా తన పాత్రను పండించే ప్రయత్నం చేయడం.. ఆయన క్యారెక్టర్లో కొంత విషయం ఉండటం.. వెంకీ స్క్రీన్ ప్రెజెన్స్ అదీ బాగుండటం.. చైతూతూ ఆయన కెమిస్ట్రీ వర్కవుట్ కావడం ‘వెంకీ మామ’లో చెప్పుకోదగ్గ సానుకూలతలు. అంతకుమించి ఇందులో విశేషాలేమీ లేవు.

అసలే పాత కథ.. దాన్ని నరేట్ చేసిన తీరులోనూ కొత్తదనం ఏమీ కనిపించదు. కథను ఫ్లాష్ బ్యాక్‌ల రూపంలో కట్ చేసి ముందుకు - వెనక్కి చెప్పడం తప్పితే స్క్రీన్ ప్లే పరంగా బాబీ అండ్ కో చేసిన మ్యాజిక్ ఏమీ లేదు. మేనల్లుడిని వెతుక్కుంటూ కశ్మీర్ కు వెళ్లే మామగా వెంకీ ఆరంభంలో కనిపించిన తీరు.. ఆయన చూపించిన ఇంటెన్సిటీ చూస్తే ఒక ఎమోషనల్ మూవీ చూడబోతున్న భావన కలుగుతుంది. ఐతే తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో మామా అల్లుళ్ల అనుబంధాన్ని ఎలివేట్ చేస్తూ సరదాగానే సినిమాను నడిపించే ప్రయత్నం చేశారు. మామను పెళ్లి వైపు నడిపించడానికి అల్లుడు.. అల్లుడి ప్రేమను సెట్ చేయడానికి మామ చేసే ప్రయత్నాలు కొంత మేర నవ్విస్తాయి. కానీ అంందులోనూ కొత్తదనం ఏమీ కనిపించదు. ఒక దశ దాటాక ఈ ఎపిసోడ్లను సాగదీసిన భావన కలుగుతుంది. ఈ ఎపిసోడ్లో డబుల్ మీనింగ్ డైలాగుల డోస్ కుటుంబ ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టేదే. ఐతే అక్కడక్కడా వెంకీ తనదైన శైలిలో వినోదం పండించడం.. వెంకీ మామ పాట ఆకట్టుకునేలా తీయడం.. యాక్షన్ సీక్వెన్సులు బాగానే పండటంతో ఫస్టాఫ్ టైంపాస్ కు ఢోకా ఉండదు.

ఐతే ద్వితీయార్ధంలో కథను మలుపు తిప్పాల్సిన చోట డ్రామా.. సెంటిమెంట్ డోస్ ఎక్కువైపోయాయి. జాతకాల చుట్టూ నడిపిన వ్యవహారం 80ల నాటి సినిమా చూస్తున్న భావన కలిగిస్తుంది. మామా అల్లుళ్లు విడిపోవడానికి దారితీసే పరిణామాలు మరీ నాటకీయంగా తయారయ్యాయి. ఇక్కడ అనుకున్న స్థాయిలో ఎమోషన్ పండలేదు. ఇక టెర్రరిస్టులపై సైన్యం దాడికి సంబంధించిన ఎపిసోడ్ సిల్లీగా అనిపిస్తుంది. కశ్మీర్ ఎపిసోడ్ అసలు ఈ సినిమాలో సింక్ అవ్వలేదు. దీన్ని బలవంతంగా ఇరికించినట్లు అవుతుంది. దాన్ని అంత పకడ్బందీగా, ట్రెండీగా ఏమీ తీయలేదు. ‘యురి: సర్జికల్ స్ట్రైక్స్’ లాంటి సినిమాలు చూస్తే ఇందులోని ఆర్మీ ఎపిసోడ్ కామెడీగా అనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు. ముఖ్యంగా మిలిటరీలో పని చేసిన అనుభవమే లేని మామ.. అల్లుడి కోసం టెర్రరిస్టుల దగ్గరికి వెళ్లి వాళ్ల నాయకుడిని చంపేయడం.. దాడిలో తీవ్రంగా గాయపడి మృత్యు అంచుల్లోకి వెళ్లి కూడా బతికేయడం అతిగా అనిపిస్తాయి. ప్రథమార్ధంలో ఉన్న ఇంప్రెషన్ కూడా.. సినిమా ముగింపులో తగ్గిపోతుంది. మొత్తంగా ‘వెంకీ మామ’ అంచనాలకు చాలా దూరంలోనే నిలిచిపోతుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు అలవాటు పడ్డవారికి ‘వెంకీ మామ’ ఓకే అనిపిస్తుంది కానీ.. మిగతా వర్గాలకు కష్టమే.

నటీనటులు:

వెంకటేష్ ఈ సినిమాకు డ్రైవింగ్ ఫోర్స్ అని చెప్పొచ్చు. ‘ఎఫ్-2’ ఊపులో వెంకీ ఈ సినిమాలో చాలా ఉత్సాహంగా నటించాడు. గత సినిమాలతో పోలిస్తే ఆయన లుక్ కూడా బాగానే కుదిరిందీ సినిమాలో. వయసుకు తగ్గ పాత్ర కావడంతో వెంకీ అలవోకగా చేసుకుపోయాడు. చైతూతో అతడి కెమిస్ట్రీ బాగా కుదిరింది. నిజంగా మామా అల్లుళ్లను చూస్తున్నట్లే అనిపిస్తుంది సినిమాలో వెంకీ చైతూలను చూస్తే. చైతూ పాత్ర మాత్రం వెంకీ క్యారెక్టర్ స్థాయిలో లేదు. అతను ఉన్నంతలో బాగా చేసినా.. తన పాత్రను మరింత బాగా తీర్చిదిద్దాల్సింది. ఆర్మీ ఎపిసోడ్ లో చైతూ ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. పాయల్ రాజ్ పుత్ పాత్ర ప్రేక్షకుల్ని కొన్ని దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్తుంది. ఆమె అప్పీయరెన్స్ కూడా ఏమంత గొప్పగా లేదు. రాశి ఖన్నాది కూడా మామూలు పాత్రే కానీ.. ఉన్నంతలో పాయల్ తో పోలిస్తే ఎక్కువ స్కోర్ చేసింది. విలన్లుగా రావు రమేష్.. దాసరి అరుణ్ కుమార్ పాత్రలు.. వాళ్ల నటన రొటీనే. ప్రకాష్ రాజ్ కూడా చేసిందేమీ లేదు. హైపర్ ఆదిది ఏమంత గుర్తుండే పాత్ర కాదు.

సాంకేతిక వర్గం:

మంచి ఫాంలో ఉన్న తమన్.. ‘వెంకీ మామ’ శైలికి తగ్గ సంగీతం అందించాడు. టైటిల్ సాంగ్ తో పాటు ‘కోకా కోలా పెప్సీ’ పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. ప్రసాద్ మూరెళ్ల కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. విజువల్స్ అందంగా ఉన్నాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ స్థాయికి తగ్గట్లే బాగా ఖర్చు పెట్టారు. సినిమాను రిచ్ గా తీర్చిదిద్దారు. దర్శకుడు బాబీ చాలా పరిమితులున్న రొటీన్ కథతో ఏ మ్యాజిక్ చేయలేకపో్యాడు. అతను ఎక్కువగా వెంకీ మీద ఆధారపడ్డాడు. ఆయన చరిష్మాను బాగానే ఉపయోగించుకున్నాడు. మామా అల్లుళ్ల మధ్య కొన్ని సన్నివేశాలు.. ప్రథమార్ధంలో యాక్షన్ ఘట్టాల్ని.. పాటల్ని బాగానే తీశాడు. కానీ కథకు కొత్త ట్రీట్మెంట్ ఇవ్వడంలో.. ఆసక్తికర స్క్రీన్ ప్లేతో నడిపించడంలో విఫలమయ్యాడు. దర్శకుడిగా అతడికి యావరేజ్ మార్కులు పడతాయి.

చివరగా: వెంకీ మామ.. కొత్తగా లేడమ్మా!

రేటింగ్- 2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre