Begin typing your search above and press return to search.
వెన్నెల క్వశ్చన్ కు...కేటీఆర్ ఆన్సర్ ఇదే!
By: Tupaki Desk | 29 Dec 2017 5:44 AM GMTఅసలు వెన్నెల క్వశ్చన్ చేయడం ఏమిటీ? దానికి కేటీఆర్ రెస్పాండ్ కావడం ఏమిటీ? అనేగా మీ డౌటు. ఇక్కడ వెన్నెల అంటే పున్నవి వెన్నెల కాదండి. పున్నమి వెన్నెల లాంటి కామెడీతో మనలను గిలిగింతలు పెట్టేస్తున్న టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోరే. *వెన్నెల* సినిమాలో నటించేసి... సదరు చిత్రంలో తాను చేసిన కామెడీతోనే తనకు గుర్తింపు వచ్చిందని భావించిన కిశోర్... తన పేరుకు ముందు వెన్నులను తగిలించేసుకున్న వైనం మనకు తెలిసిందేగా. అయినా ఇప్పుడు వెన్నెల కిశోర్ కు ఏం కష్టాలు వచ్చాయని... తెలంగాణ ఐటీ శాఖ మంత్రి వద్దకు పరుగెత్తారు అనుకోకండి.
ఎందుకంటే కిశోర్ కేమీ ఇబ్బంది రాలేదు గానీ... ట్విట్టర్ వేదికగా *#ఆస్క్ కేటీఆర్* పేరిట కేటీఆర్ నిర్వహించిన ఓ గ్రీవెన్స్ లాంటి కార్యక్రమం జరుగుతోందని తెలుసుకున్న వెన్నెల కిశోర్... తాను కూడా ఏదో ఒక సమస్యను కేటీఆర్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లకూడదని భావించారట. అనుకున్నదే తడవుగా తాను నివాసం ఉంటున్న మణికొండ ప్రాంతంలో సరైన రోడ్లు లేని వైనాన్ని గుర్తుకు తెచ్చుకుని... అదే సమస్యను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారట. వెన్నెల కిశోర్ నుంచి వచ్చిన సదరు ఫిర్యాదుకు కేటీఆర్ చాలా వేగంగానే రియాక్ట్ అయ్యారట. అంతేకాకుండా సదరు సమస్యను త్వరితగతిన పరిష్కరించడమే కాకుండా... మరోమారు కలిసినప్పుడు సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా సమస్యలపై చర్చించుకుందామంటూ కేటీఆర్ చెప్పారట.
కేటీఆర్ క్విక్ రియాక్షన్ కు ఫిదా అయిపోయిన వెన్నెల కిశోర్.. సమస్యల పరిష్కారంపై కేటీఆర్ కు ఉన్న ఆసక్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారట. #ఆస్క్ కేటీఆర్ వేదికగా కిశోర్ - కేటీఆర్ ల మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందన్న విషయానికి వస్తే... ముందుగా తన సమస్యను తెలుపుతూ కిశోర్ *సర్.. నేను ప్రస్తావించే సమస్య కంటే చాలా ముఖ్యమైన సమస్యలు ఉంటాయని తెలుసు. అయినా మణికొండలో సరైన రోడ్లను ఏర్పాటు చేసే అవకాశాలేమైనా ఉన్నాయా? చాలా ఏళ్ల నుంచి ఈ సమస్య ఉంది* అని ప్రస్తావించారట. వెన్నెల కిశోర్ పేరు చూడగానే వెంటనే స్పందించిన కేటీఆర్ *తప్పనిసరిగా. త్వరలోనే అక్కడ సరైన రోడ్లను ఏర్పాటు చేస్తాం. ఈ విషయంలో మీకు హామీ ఇస్తున్నాను. ఓకే థియేటర్లు - సినిమా టికెట్ల ధరలు - సినిమా ఇండస్ట్రీ సమస్యలపై మరోమారు చర్చించుకుందాం* అంటూ కేటీఆర్ స్పందించారట. ఇంత వేగంగా కేటీఆర్ స్పందించిన తీరుతో వెన్నెల కిశోర్ ఫిదా అయిపోగా... కేటీఆర్ దృష్టికి రోడ్ల దుస్థితిని తీసుకెళ్లిన కిశోర్ చొరవను మణికొండ వాసులు మాత్రం ఆకాశానికెత్తేశారట.