Begin typing your search above and press return to search.

'షోలే'లో అమితాబ్ లా 'దమ్ము'లో నా పాత్ర ఉంటుందన్నారు.. తీరా చూస్తే..!

By:  Tupaki Desk   |   29 July 2022 4:24 AM GMT
షోలేలో అమితాబ్ లా దమ్ములో నా పాత్ర ఉంటుందన్నారు.. తీరా చూస్తే..!
X
'స్వ‌యంవ‌రం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వేణు తొట్టెంపూడి.. త‌న‌దైన కామెడీ టైమింగ్ తో కొన్నేళ్ల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పరచుకున్న వేణు.. 'చిరున‌వ్వుతో' 'హ‌నుమాన్ జంక్ష‌న్‌' 'క‌ళ్యాణ రాముడు' 'పెళ్లాం ఊరెళితే' 'ఖుషీ ఖుషీగా' 'చెప్పవే చిరుగాలి' వంటి పలు సినిమాలతో మెప్పించారు.

'గోపి గోపిక గోదావ‌రి' సినిమా త‌ర్వాత బ్రేక్ తీసుకుని.. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దమ్ము' చిత్రంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ గా మారాడు వేణు. ఈ క్రమంలో హీరోగా చేసిన 'రామాచారి' సినిమా నిరాశ పరిచింది. దీంతో వ్యాపార కార్య‌క‌లాపాలపై దృష్టి పెట్టి సినిమాల‌కు దూరంగా ఉంటూ వచ్చాడు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ''రామారావు ఆన్ డ్యూటీ'' చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు వేణు. మూవీ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్న వేణు.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ‘దమ్ము’ చిత్రంలో చిన్న పాత్ర చేయడం గురించి కూడా స్పందించారు.

వేణు మాట్లాడుతూ.. 'షోలే' సినిమాలో అమితాబ్ లాంటి క్యారెక్టర్ అన్నారు. తీరా చూస్తే ఏం జరిగిందో మీకే తెలుసు. షోలేలో అమితాబ్ చనిపోయినట్లు 'దమ్ము' సినిమాలో నా క్యారెక్టర్ కూడా చనిపోతుంది. అందుకే అలా చెప్పి ఉండొచ్చు అంటూ నవ్వుతూ చెప్పారు.

అంతేకాదు 'దమ్ము' సినిమా చేసినందుకు ఎప్పుడూ రిగ్రెట్ ఫీల్ అవ్వలేదని వేణు అన్నారు. సినిమా అనేది ఓ ప్రయాణమని.. ఆ దారిలో తనకొచ్చిన పాత్రలను గౌరవించుకుంటూ వెళ్లానని.. ఓ తప్పు చేస్తే అక్కడితో ప్రయాణం ఆడిగిపోయినట్లు కాదని చెప్పుకొచ్చారు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన 'లెజెండ్' సినిమాలో తన పాత్రపై జగపతి బాబు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే 'స్వయవరం' 'చిరునవ్వుతో' చిత్రాలకు కథలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. తన సినిమాల్లో వేణు కు ఎలాంటి పాత్ర ఇవ్వలేదనే దానిపైనా వేణు స్పందించారు. ''తన సినిమాల్లో నాకు సరిపడే పాత్ర ఉంటే కచ్చితంగా చెప్తారు. 'అతడు' సినిమాలో సోనూ సూద్ పాత్ర కోసం మొదట నన్నే సంప్రదించారు. నేను ఆ క్యారక్టర్ చేయకపోవడంతో ఆయన చేశారు'' అని తెలిపారు వేణు.

మరో ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలోనే నాకు మంచి మంచి స్క్రిప్ట్స్ ఇచ్చి ఒక రకంగా నా కెరీర్ ను నాశనం చేసాడు అని వేణు సరదాగా అన్నారు. అలానే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేయాల్సిన రెండు సినిమాలు మిస్సయ్యాయనే విషయాన్ని కూడా వెల్లడించారు. 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' 'దేశ ముదురు' కథలు ముందు తనకే చెప్పారని.. కానీ ఆ సినిమాలు తనతో చేయలేదని వేణు తొట్టెంపూడి వెల్లడించారు.