Begin typing your search above and press return to search.

తక్కువ సినిమాలు చేయడానికి నాలోని ఆ లోపమే కారణం!

By:  Tupaki Desk   |   19 July 2022 11:30 PM GMT
తక్కువ సినిమాలు చేయడానికి నాలోని ఆ లోపమే కారణం!
X
వేణు తొట్టెంపూడి పేరు వినగానే సన్నగా .. పొడుగ్గా ఉన్న ఆయన రూపం గుర్తొస్తుంది. కామెడీ టచ్ తో కూడిన ఆయన డైలాగ్ డెలివరీ గుర్తొస్తుంది .. డిఫరెంట్ గా అనిపించే ఆయన బాడీ లాంగ్వేజ్ కళ్లముందు కదలాడుతుంది. 'స్వయంవరం' సినిమాతో తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టిన వేణు, ఆ తరువాత 'చిరునవ్వుతో' .. 'హనుమాన్ జంక్షన్' వంటి హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి కేరక్టర్ ఆర్టిస్టుగా మారిన ఆయన, 'దమ్ము' సినిమా తరువాత తెరపై కనిపించలేదు.

పదేళ్ల తరువాత 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు.

తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ఆయన మాట్లాడుతూ .. "కోవిడ్ సమయంలో ఇంటిపట్టునే ఉండటం వలన సినిమాలు .. వెబ్ సిరీస్ లు ఎక్కువగా చూసే సమయం చిక్కింది. దాంతో తిరిగి నటించాలనే కోరిక కలిగింది. ఆ తపనతో ఉండగా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో చేసే అవకాశం దక్కింది. ఏదైనా మన మంచికే అని రంగంలోకి దిగిపోయాను.

మొదటి నుంచి కూడా నేను నిదానంగా సినిమాలు చేస్తూ రావడానికి కారణం .. నాకు బిడియం ఎక్కువగా ఉండటమే. ఎవరిలోనూ అంత తొందరగా కలవలేను. చొరవ తీసుకుని ముందుకు వెళ్లలేను. ఈ కారణంగా నాకు ఇండస్ట్రీలో పెద్దగా పరిచయాలు ఏర్పడలేదు.

నాలోని ఈ లోపమే నేను సినిమాలు తక్కువగా చేయడానికి కారణమని నేను భావిస్తున్నాను. అందరితో కలుపుగోలుగా ఉండాలి .. మంచి ప్రాజెక్టులు తెచ్చుకోవాలి అనే విషయం కూడా నాకు తెలియదు. సినిమాలు వరుసగా చేయాలని ఉండేది .. కానీ ప్రయత్న లోపం ఎక్కువ.

నేను చదువుకునే రోజుల్లోనే నాకు ఒక విషయం అర్థమైంది. తమిళనాడులో ఒక వైపున 'శంకరాభరణం' .. మరో వైపున 'డిస్కో డాన్సర్' 200 రోజులపైన ఆడాయి. సోమయాజులు గారు అప్పటికి ఎవరికీ తెలియదు. సినిమాకి భాషతో పనిలేదు .. కథ ముఖ్యం అనే విషయం నాకు అర్థమైపోయింది. మా కుటుంబ నేపథ్యంలో రాజకీయనాయకులు ఉన్నారు. కానీ నాకు మాత్రం రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. అసలు అటువైపే వెళ్లను. ఇకపై నటన పైనే పూర్తి దృష్టి పెడతాను" అంటూ చెప్పుకొచ్చారు.