Begin typing your search above and press return to search.

'ఆర్ ఆర్ ఆర్' సినిమాను సర్కస్ తో పోల్చిన వర్మ!

By:  Tupaki Desk   |   24 Aug 2022 1:30 AM GMT
ఆర్ ఆర్ ఆర్ సినిమాను సర్కస్ తో పోల్చిన వర్మ!
X
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని ఉద్దేశించి ఏం కామెంట్ చేస్తాడనేది ఎవరికీ తెలియదు. ఏ విషయంపై ఆయన ఏ కోణంలో స్పందిస్తాడనేది కూడా ఎవరికీ అర్థం కాదు. అలాంటి వర్మ తాజాగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను గురించి ప్రస్తావించారు.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. దేశభక్తిని ప్రేరేపించే దిశగా ఈ కథ నడుస్తుంది. విడుదలైన తొలిరోజునే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది.

అత్యంత వేగంగా వేయికోట్లను రాబట్టిన సినిమాగా ఇది నిలిచింది. ఈ సినిమాలో ఏ హీరో పాత్రకి ఎంత ప్రాధాన్యత ఉందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అందరూ ఆ విషయాన్ని గురించే మాట్లాడుకున్నారు. కానీ వర్మ మాత్రం డిఫరెంట్ గా స్పందించారు. ఈ సినిమా చూస్తుంటే తనకి సర్కస్ చూస్తున్న ఫీలింగ్ కలిగిందని అన్నాడు.

సర్కస్ చూస్తున్నప్పుడు ఎలాంటి ఆనందం .. ఆసక్తి కలుగుతాయో, అలాంటి ఫీలింగ్స్ తనకి కలిగాయని చెప్పారు. ముఖ్యంగా ఎన్టీఆర్ - చరణ్ ఇద్దరూ కలిసి వంతెన పై నుంచి దూకేసి ఒక పిల్లవాడిని కాపాడే సీన్ చూస్తున్నప్పుడు తనకి జెమిని సర్కస్ చూస్తున్నట్టుగా అనిపించిందని అన్నారు.

ఇక సాధారణంగా చాలామంది మణిరత్నం సినిమాలను ఇష్టపడుతుంటారు. ఒక సన్నివేశానికి ఆయన ఇచ్చే దృశ్యరూపం విభిన్నంగా ఉంటుందని అభినందనలు గుప్పిస్తుంటారు. మణిరత్నం నుంచి ఫ్లాపులు వచ్చినా, అవి ఆయన ఇమేజ్ ను డామేజ్ చేయలేని స్థితికి ఆయన చేరుకున్నారు. ఆయన టేకింగ్ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే, ఎవరైనా సరే అనుమానంగా చూస్తారు. అలాంటిది వర్మ ఆయన సినిమాలను గురించి ప్రస్తావిస్తూ, తన సినిమాలు మణిరత్నానికి నచ్చనట్టే ఆయన సినిమాలు తనకి నచ్చవని సింపుల్ గా తేల్చిపారేశారు.

ఇక వర్మ ఎక్కువగా సినిమాలు తీసింది మాఫియా మీద .. దెయ్యాల మీద. అంతగా వర్మ దెయ్యాలపై సినిమాలు తీస్తుంటారు. .. దెయ్యాలపై ఆయనకి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలనుకుంటారు. ఇందుకు సమాధానంగా వర్మ స్పందిస్తూ, చీకట్లో ఉండిపోవలసి వచ్చినప్పుడు తానే ఒక దెయ్యంగా అనుకుంటాననీ, అలాంటప్పుడు ఇక ఎలాంటి భయం ఉండదంటూ చెప్పుకొచ్చారు. తనకి చావంటే భయం లేదుగానీ, చనిపోయిన తరువాత ఏం జరుగుతుందో తెలిసుకోవాలనే కుతూహలం మాత్రం ఉందంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చారు.