Begin typing your search above and press return to search.

వర్మ ఆ డబ్బులు ఇంతవరకూ ఇవ్వలేదంటున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   27 Jan 2022 8:35 AM GMT
వర్మ ఆ డబ్బులు ఇంతవరకూ ఇవ్వలేదంటున్న హీరోయిన్
X
శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ గా మహేశ్వరి కొన్ని సినిమాలు చేసింది. ఆ సినిమాల్లో 'గులాబీ' .. 'పెళ్లి' .. 'నీ కోసం' .. 'దెయ్యం' .. 'జాబిలమ్మ పెళ్లి' సినిమాలు ఆమెకి మంచి పేరును తీసుకొచ్చాయి. 'గులాబీ' సినిమా ఆమెను యూత్ కి బాగా కనెక్ట్ చేసింది. ఇక 'పెళ్లి' సినిమాతో ఆమె ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా చేరువైంది.

చేసింది కొన్ని సినిమాలే అయినా ఆమెను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. వివాహమైన తరువాత సినిమాలకి దూరమైన మహేశ్వరి, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, 'దెయ్యం' షూటింగు సమయంలో జరిగిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించారు.

'దెయ్యం' సినిమా షూటింగు కోసం రామూ గారు మమ్మల్ని సిటీకి దూరంగా ఉన్న ఒక ఫామ్ హౌస్ కి తీసుకుని వెళ్లారు. షూటింగు అంతా కూడా అక్కడే జరిగింది. రెండు నెలల పాటు అక్కడ షూటింగ్ చేశారు. ఆ ఫామ్ హౌస్ ప్రాంతమంతా చూడటానికి అదోలా .. భయాన్ని కలిగించేలా ఉండేది.

ఆ ఫామ్ హౌస్ కి వెళ్లాలంటే మెయిన్ రోడ్ పై నుంచి రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్లాలి. ఈ రెండు కిలోమీటర్లు కూడా దారి చాలా సన్నగా ఉంటుంది. ఒక కారు మాత్రమే వెళ్లే దారి అది. ఆ దారికి రెండు వైపులా పొడవైన చెట్లు ఉంటాయి. ఎక్కడా ఎవరూ కనిపించరు.

ఫామ్ హౌస్ దగ్గరలో స్మశానం సెట్ వేశారు .. అర్థరాత్రి 1 గంటకు షూటింగు పెట్టారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడి వాతావరణం కారణంగా మా అందరికీ లోపల భయంగా ఉన్నప్పటికీ, పైకి కనిపించనీయకుండా ఉన్నాం.

అప్పుడు రామూగారు "ఈ సమయంలో ఎవరైనా సరే మెయిన్ రోడ్ వరకూ ఒంటరిగా వెళ్లి రాగలరా? అలా చేస్తే 50 వేలు ఇస్తాను" అని అన్నారు. అక్కడున్నవాళ్లెవరూ మాట్లాడలేదుగానీ .. నేను మాత్రం 'నేను వెళతాను' అన్నాను. అప్పుడు ఆయన నా వైపు ఆశ్చర్యంగా చూశారు.

'నేను వెళ్లొస్తాను' అని అన్నానుగానీ .. భయం ఒక రేంజ్ లో ఉంది. ఎందుకంటే రెండు కిలోమీటర్ల దూరం వరకూ ఎవరూ ఉండరు. షూటింగు జరుగుతున్నప్పుడే వెనకి నుంచి ఎవరైనా వచ్చి లాక్కెళ్లిపోతారేమోనని అనిపించేది. అయినా ఆ భయంతోనే మెయిన్ రాడ్ వరకూ వెళ్లి వచ్చాను. కానీ రామూ గారు ఇంతవరకూ ఆ 50 వేలు మాత్రం ఇవ్వలేదు. ఆయన కనిపిస్తే మాత్రం ఆ 50 వేల సంగతేంటని అడిగేస్తాను" అంటూ మహేశ్వరి నవ్వేశారు. రీ ఎంట్రీ ఇవ్వడానికి తాను సిధ్ధంగానే ఉన్నాననీ, అయితే అందుకు తగిన పాత్రలు రావాలని ఈ కార్యక్రమం చివరిలో ఆమె అన్నారు. అలాంటి పాత్రలను ఎవరైనా ఆఫర్ చేస్తారేమో చూడాలి మరి.