Begin typing your search above and press return to search.

జ్యోతిల‌క్ష్మి ఇక లేరు

By:  Tupaki Desk   |   9 Aug 2016 4:43 AM GMT
జ్యోతిల‌క్ష్మి ఇక లేరు
X
తెలుగు తెర‌పైన ఐటెం సాంగ్స్ కు తొలిత‌రం ప్ర‌తినిధులుగా చెప్పే జ్యోతిల‌క్ష్మి ఇక‌లేరు. ప్ర‌ముఖ న‌టిగా.. డ్యాన్స‌ర్ గా పేరున్న ఆమె త‌న 63 ఏళ్ల వ‌య‌సులో అనారోగ్యంతో క‌న్నుమూశారు. మూడున్న‌ర ద‌శాబ్దాల క్రితం తెలుగు తెర‌ను ఊపేసిన శృంగార నృత్య‌తార‌ల్లో జ్యోతిల‌క్ష్మి ఒక‌రు. డ్యాన్సుల‌తో పాటు.. త‌న‌దైన న‌ట‌న‌తో అల‌రించిన‌జ్యోతిల‌క్ష్మి నాటి ప్ర‌ముఖ హీరోలంద‌రి సినిమాల్లోనూ న‌టించారు. అంతేకాదు.. 80వ ద‌శ‌కంలో జ్యోతిల‌క్ష్మి పాట ఉంటే చాలు.. సినిమా హిట్ అయిన‌ట్లేన‌న్న సెంటిమెంట్ ఉండేది. దీంతో జ్యోతిలక్ష్మి పాట ప్ర‌తి సినిమాల్లో త‌ప్ప‌నిస‌రిగా ఉండేది.

300 చిత్రాల్లో న‌టించిన ఆమె.. త‌న అందం.. హావ‌భావాల‌తో నాటి ర‌సిక ప్రియుల‌ను ఒక ఊపు ఊపేశార‌ని చెప్పాలి. తెర మీద అంత‌లా చెల‌రేగిపోయిన ఆమె.. పెళ్లి చేసుకున్న త‌ర్వాత వెండితెర‌కు దూర‌మ‌య్యారు. త‌ర్వాత కాలంలో బ‌య‌టకు పెద్ద‌గా రాని ఆమె.. త‌ర్వాతి కాలంలో బుల్లి తెర మీద ద‌ర్శ‌నమిచ్చారు. వెండితెర‌కు భిన్నంగా.. బుల్లితెర మీద మాత్రం హుందా పాత్ర‌ల్లోనే న‌టించారు.

ఇదా లోకం, - మోసగాళ్లకు మోసగాడు - గండరగండడు, పిల్లాపిడుగా - గాంధర్వ కన్య, సీతారాములు - బెబ్బులి - బాబులుగాడి దెబ్బ - స్టేట్‌ రౌడీ - బిగ్‌బాస్‌ - కలుసుకోవాలని - దొంగరాముడు అండ్‌ పార్టీ - బంగారు బాబు లాంటి ఎన్నో సినిమాల్లో న‌టించిన ఆమె.. వారం రోజులుగా అనారోగ్యంతో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈ రోజు ఉద‌యం ఆమె తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయారు. తెలుగు.. త‌మిళం.. మ‌ల‌యాళం.. హిందీ చిత్రాల్లో న‌టించి గుర్తింపు పొందిన ఆమె మ‌ర‌ణం సినీ ప్రియుల‌కు ఒక షాక్ లాంటిదే.