Begin typing your search above and press return to search.

మాస్ రాజా కోసం అతను మారిపోయాడు

By:  Tupaki Desk   |   25 April 2018 10:48 AM IST
మాస్ రాజా కోసం అతను మారిపోయాడు
X
మనది హీరోల చుట్టూ తిరిగే ఇండస్ట్రీ. కథలు రాసి అందుకు తగ్గ హీరోల్ని ఎంచుకోవడం కంటే.. హీరోల్ని దృష్టిలో ఉంచుకుని కథలు రాసే రచయితలు.. దర్శకులే ఎక్కువ ఇక్కడ. చాలామంది దర్శకులు హీరోల కోసం తమ అభిరుచుల్ని.. తమ శైలిని మార్చుకుంటూ ఉంటారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన తమిళ దర్శకుడు వీఐ ఆనంద్ కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు సమాచారం.

తెలుగులో తాను తీసిన ‘టైగర్’తోనే వైవిధ్యం చూపించాడు ఆనంద్. ఆ తర్వాత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అతనెంత భిన్నమైన దర్శకుడో చూపించింది. దీని తర్వాత తీసిన ‘ఒక్క క్షణం’ కూడా వైవిధ్యమైన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఐతే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడతను మాస్ రాజా రవితేజతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం వీఐ ఆనంద్ గత సినిమాల తరహాలో ఉండదట. ఇది పూర్తి స్థాయి ఎంటర్టైనర్ అని సమాచారం.

ఈ చిత్రానికి ‘డిస్కో రాజా’ అనే పేరు కూడా ఖరారు చేసేశాడు ఆనంద్. ఈ టైటిల్‌ ను బట్టే ఇది ఆనంద్ మార్కు సినిమా కాదు.. రవితేజ స్టైల్ మూవీ అనే విషయం స్పష్టమవుతుంది. రవితేజ ఎక్కువగా మాస్ మసాలా సినిమాలే చేస్తుంటాడన్న సంగతి తెలిసిందే. త్వరలోనే అతను ‘నేల టిక్కెట్టు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ తర్వాత శ్రీను వైట్ల డైరక్షన్లో చేస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వస్తుంది. ఆపై వీఐ ఆనంద్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు మాస్ రాజా.