Begin typing your search above and press return to search.

కిరణ్ అబ్బవరం 'VBVK' గ్లింప్స్: ఏడు కొండల చుట్టూ తిరిగే విష్ణు కథ..!

By:  Tupaki Desk   |   14 July 2022 12:34 PM GMT
కిరణ్ అబ్బవరం VBVK గ్లింప్స్: ఏడు కొండల చుట్టూ తిరిగే విష్ణు కథ..!
X
టాలెంటెడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన హ్యాపెనింగ్ హీరో.. ఇప్పుడు ''వినరో భాగ్యము విష్ణుకథ'' అంటూ వస్తున్నాడు.

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతున్న 'వినరో భాగ్యము విష్ణుకథ' చిత్రంలో కిరణ్ సరసన క‌శ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్ గా నటిస్తోంది. ముర‌ళి కిషోర్ అబ్బూరి అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నాడు.

జులై 15న హీరో కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు సందర్భంగా తాజాగా 'వినరో భాగ్యము విష్ణుకథ' గ్లింప్స్ ను విడుదల చేసారు మేకర్స్. ఇప్పటికే కిరణ్ గుడి ముందు డు డు బసవన్నతో లుంగీ కట్టుకొని పర్ఫెక్ట్ మాస్ లుక్‌ లో ఉన్న పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన గ్లిమ్స్ ఆసక్తికరంగా ఉంది.

'ఏడు వింతల గురించి మాకు పెద్దగా తెలియదన్నా.. మా జీవితాలన్నీ ఏడు కొండల చుట్టూ తిరుగుతా ఉంటాయి' అని కిరణ్ చిత్తూరు యాసలో చెప్పే డైలాగ్ తో ఈ వీడియో ప్రారంభమైంది. 'నా పేరు విష్ణు.. మా ఊరు తిరుపతి.. మరికొన్ని రోజుల్లో మీరు చూడబోయేదే నా కథ. ఇప్పుడు నా కథ ఎందుకు చెప్తున్నానంటే..' అని కిరణ్ చెప్తుండగానే.. హ్యాపీ బర్త్ డే విష్ణు అంటూ గ్లిమ్స్ ముగుస్తుంది.

ఇందులో కిరణ్ లుక్ మాస్ ఆడియన్స్ తో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునేలా ఉంది. మురళీ శర్మ - ఆమని - దేవీ ప్రసాద్ - శుభలేఖ సుధాకర్ - ప్రవీణ్ - పమ్మి సాయి తదితరులు ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ గ్లిమ్స్ కు చైత‌న్ భరద్వాజ్ సమకూర్చిన నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొత్తం మీద ఈ వీడియోకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డేనియల్ విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందించగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామ్ కుమార్ ఆర్ డైరెక్ట‌ర్ గా వర్క్ చేస్తున్నారు. బాబు స‌హ నిర్మాత‌గా.. స‌త్య‌గమిడి - శ‌రత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

'వినరో భాగ్యము విష్ణుకథ' చిత్రాన్ని సెప్టెంబర్ 30న గ్రాండ్ గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు మరియు ఆసక్తికరమైన అప్డేట్స్ ఇవ్వనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.