Begin typing your search above and press return to search.

విజయ్ వచ్చేస్తున్నట్లేనా?

By:  Tupaki Desk   |   9 Nov 2018 4:55 PM GMT
విజయ్ వచ్చేస్తున్నట్లేనా?
X
ఓవైపు జయలలిత.. మరోవైపు కరుణానిధి.. తమిళనాడు రాజకీయాల్ని దశాబ్దాలు జోడించిన రాజకీయ యోధులు వీళ్లిద్దరూ. వీళ్లు ఉండగా వేరే వాళ్లకు అవకాశమే రాలేదు. కానీ ఈ ఇద్దరూ తక్కువ వ్యవధిలో కాలం చేయడంతో తమిళనాట ఒక్కసారిగా రాజకీయ శూన్యత ఆవహించింది. దాన్ని పూరించడానికి సినీ రంగం నుంచి ఆల్రెడీ ఇద్దరు దిగ్గజాలు రంగంలోకి దిగేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్.. లోకనాయకుడు కమల్ హాసన్ ఆల్రెడీ తమ రాజకీయ అరంగేట్రం గురించి ప్రకటించేశారు. త్వరలోనే మరో స్టార్ హీరో విజయ్ సైతం వీరి బాటలో నడిచేలా కనిపిస్తున్నాడు. 2020 ఎన్నికల బరిలో విజయ్ కూడా నిలిస్తే ఆశ్చర్యమేమీ లేదు. ఆ దిశగా బలంగా సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటిదాకా విజయ్ బహిరంగంగా రాజకీయాల గురించి మాట్లాడింది లేదు. తన రాజకీయారంగేట్రం గురించి ప్రస్తావించింది లేదు. కానీ తన సినిమాల ద్వారా తన ఉద్దేశాల్ని గట్టిగానే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు విజయ్. గతంలో ‘తలైవా’ అనే సినిమాలో విజయ్ తన రాజకీయ ఉద్దేశాల్ని చాటి చెప్పాడు. ఇక గత ఏడాది ‘మెర్శల్’లో సామాజికాంశాల ప్రస్తావన.. తనను తాను ఒక నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అతడి కొత్త సినిమా ‘సర్కార్’ పూర్తిగా రాజకీయాల చుట్టూ సాగిన సినిమా. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ఇదొక మార్గం లాగా కనిపించింది.
ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో మీరు ముఖ్యమంత్రయితే ఏం చేస్తారని యాంకర్ అడిగితే.. ‘‘నేను ముఖ్యమంత్రినైతే.. ముఖ్యమంత్రిగా నటించను’’ అని బదులిచ్చాడు. అంటే తాను యాక్టింగ్ సీఎంలా కాకుండా యాక్టివ్ సీఎంగా ఉంటానని సంకేతాలిచ్చాడు. ఇక ‘సర్కార్’ సినిమాలో వివిధ సన్నివేశాలు.. డైలాగుల్ని పరిశీలిస్తే అతడికి త్వరలోనే రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఉన్నట్లు అర్థమవుతోంది. దీనికి తోడు ‘సర్కార్’ను వివాదాల్లోకి లాగడం ద్వారా అధికార అన్నాడీఎంకే పార్టీ అతడిని మరింత కవ్వించింది. ఈ నేపథ్యంలో విజయ్ రాజకీయారంగేట్రానికి ఎక్కువ కాలం ఎదురు చూడాల్సిన అవసరం రాకపోవచ్చేమో.