Begin typing your search above and press return to search.

వరల్డ్ ఫేమస్ లవర్ ఒక్కడే

By:  Tupaki Desk   |   30 Jan 2020 7:05 AM GMT
వరల్డ్ ఫేమస్ లవర్ ఒక్కడే
X
విజయ్ దేవరకొండ కెరీర్లో అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ఏడాది ముందు పీక్స్‌లో ఉన్న అతడి క్రేజ్.. ఇప్పుడు ఆ స్థాయిలో లేదు. కెరీర్లో ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో నెగెటివిటీ చుట్టుకుంది అతడి చుట్టూ. ‘డియర్ కామ్రేడ్’తో బాక్సాఫీస్ దగ్గర గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు విజయ్. దీని తర్వాత అతడి నుంచి రాబోతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’పై ముందు నుంచి ఏమంత పాజిటివ్ బజ్ లేదు. దీని టీజర్ కొంచెం సెన్సేషనల్‌గానే అనిపించినప్పటికీ.. ‘అర్జున్ రెడ్డి’ సహా కొన్ని సినిమాల ఛాయలు కనిపించడం తో దీనిపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడిక ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. వేలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14నే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

‘వరల్డ్ ఫేమస్ లవర్’లో ఏకంగా విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నలుగురు హీరోయిన్లతోనూ అతను డీప్ రొమాన్స్ చేస్తూ కనిపించాడు ప్రోమోల్లో. నలుగురు హీరోయిన్లతో నాలుగు రకాల లుక్స్‌లోనూ దర్శనమిచ్చాడు విజయ్. దీంతో సినిమాలో అతడి పాత్ర ఒక్కటేనా.. లేక రెండో మూడో నాలుగో పాత్రలు చేశాడా అని సందేహాలున్నాయి. ఐతే ఈ చిత్ర నిర్మాత కె.ఎస్.రామారావు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు. సినిమాలో విజయ్ పాత్ర ఒక్కటే అన్నాడు. యుక్త వయసు నుంచి వివిధ కాలాల్లో ఒక వ్యక్తికి ఎదురైన ప్రేమ దశల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందన్నాడు. అంటే ‘నా ఆటోగ్రాఫ్’, ‘కేరాఫ్ కంచరపాలెం’ తరహాలో వేర్వేరు వయసుల్లో ఓ వ్యక్తి కి ఎదురైన ప్రేమ అనుభవాల నేపథ్యం లో సినిమా నడుస్తుందన్నమాట. ఈ తరహా కథలైతే తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. మరి తెలిసిన కథనే క్రాంతి మాధవ్ ఎలా కొత్తగా చెప్పాడు.. విజయ్ ఎలా పెర్ఫామ్ చేశాడు.. హీరోయిన్లు ఎలా ప్రత్యేకత చాటుకున్నారు అన్నది చూడాలి.