Begin typing your search above and press return to search.

అమ్మో.. ‘అర్జున్ రెడ్డి’ అంతా?

By:  Tupaki Desk   |   20 Aug 2017 11:05 AM GMT
అమ్మో.. ‘అర్జున్ రెడ్డి’ అంతా?
X
ఒకప్పుడు తెలుగు సినిమాల నిడివి మినిమం రెండున్నర గంటలుండేది. కొన్ని సినిమా మూడు గంటల లెంగ్త్ కూడా ఉండేవి. అప్పట్లో నిడివి అన్నది పెద్ద సమస్యగా ఉండేది కాదు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. ఈ మధ్య టాలీవుడ్ సినిమాల లెంగ్త్ రెండు-రెండుంబావు గంటలకు అటు ఇటు ఉంటోంది. లెంగ్త్ రెండున్నర గంటలు దాటడం అరుదే. బాహుబలి లాంటి సినిమాలు మినహాయిస్తే రెండున్నర గంటలకు పైగా నిడివి ఉంటే జనాలు ఇబ్బంది పడిపోతున్నారు. నిడివి ఎక్కువ అవగానే జనాలకు విసుగొచ్చేస్తోంది. సినిమా సాగతీత అయిందన్న కామెంట్లు వచ్చేస్తున్నాయి. అందుకే లెంగ్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు దర్శక నిర్మాతలు. సినిమా అంతా రెడీ అనుకున్నాక కూడా కొంత మేర సన్నివేశాల్ని కట్ చేసి ఫస్ట్ కాపీ రెడీ చేస్తున్న సందర్భాలు బోలెడు.

ఇలాంటి తరుణంలో వచ్చే శుక్రవారం రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ సినిమాను 2 గంటల 55 నిమిషాల నిడివితో వదులుతుండటం విశేషం. తెలుగులో మూడు గంటల నిడివితో సినిమాలు వచ్చి ఎన్నేళ్లయిందో.. చివరిగా ఇంత నిడివితో ఎప్పుడు సినిమా వచ్చిందో కూడా జనాలకు గుర్తు లేదు. ఈ మధ్య కృష్ణవంశీ సినిమా ‘నక్షత్రం’ను 2 గంటల 46 నిమిషాల నిడివితో రిలీజ్ చేశారు. దాని ఫలితం ఏమైందో తెలిసిందే. ఐతే కంటెంట్ బలంగా ఉంటే నిడివి సమస్య కాదన్న మాట వాస్తవమే కానీ.. ఓ అప్ కమింగ్ హీరోతో ఓ కొత్త దర్శకుడు ఇంత నిడివితో సినిమా తీసి.. దాన్ని అదే లెంగ్త్ తో రిలీజ్ చేస్తుండటం మాత్రం సాహసమే. ‘అర్జున్ రెడ్డి’ టీజర్.. ట్రైలర్ జనాల్లో ఆసక్తి రేకెత్తించిన సంగతి కూడా వాస్తవమే. కానీ సీరియస్ గా.. ఇంటెన్స్ గా అనిపిస్తున్న సినిమాను అంత నిడివితో రిలీజ్ చేస్తే థియేటర్లలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందన్నదే సందేహంగా మారింది. మరి ఇంత నిడివితోనూ జనాలతో ‘అర్జున్ రెడ్డి’ ఓకే అనిపించుకుంటాడేమో చూద్దాం.