Begin typing your search above and press return to search.

బ్రాండ్ బాయ్ గా అర్జున్ రెడ్డి

By:  Tupaki Desk   |   4 July 2018 7:45 AM GMT
బ్రాండ్ బాయ్ గా అర్జున్ రెడ్డి
X
ఇంకో బ్లాక్ బస్టర్ వచ్చే వరకు విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి రిఫరెన్స్ తప్పదు. దాని సక్సెస్ తాలూకు ప్రభావం ఆ రేంజ్ లో ఉంది మరి. దాని తర్వాత సోలో హీరోగా విజయ్ దేవరకొండ నటించిన సినిమా ఏది విడుదల కానప్పటికీ క్రేజ్ విషయంలో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసడర్ గా కొత్త అడుగులు వేస్తున్నాడు. మొబైల్ ఫోన్స్ వ్యాపారంలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్న సంగీత మొబైల్స్ తమ బ్రాండ్ ను ప్రమోట్ చేయటం కోసం విజయ్ దేవరకొండతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అధికారికంగా దీన్ని అనౌన్స్ చేస్తూ హీరో చేతే లాంచ్ చేయించారు. ఇకపై విజయ్ ఈ స్టోర్ కి సంబందించిన యాడ్స్ లో మాత్రమే కాకుండా టీవీ ప్రకటనల్లో కూడా కనిపిస్తాడు. ఇందుకు గాను పారితోషికం ఎంతిస్తున్నారు అనే వార్త బయటికి రాలేదు కానీ మంచి ఆఫర్ ఇచ్చినట్టు ఇన్ సైడ్ టాక్. విజయ్ కూడా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు.

తారలు బ్రాండ్ అంబాసడర్ గా మారడం కొత్త విశేషం కాదు కానీ పది సినిమాల వయసు కూడా లేని విజయ్ దేవరకొండకు ఈ రకంగా ఆఫర్స్ రావడం అంటే విశేషమే. మొబైల్ రిటైల్ స్టోర్స్ కూడా కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతున్నాయి. ఇటీవలే హ్యాపీ మొబైల్స్ రామ్ చరణ్ ను తమ బ్రాండ్ ప్రమోటర్ గా తీసుకోగా ఇప్పుడు విజయ్ లైన్ లోకి వచ్చాడు. గతంలో వీటిని హీరోయిన్లు మాత్రమే ప్రమోట్ చేసేవారు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కంపెనీలు కూడా హీరోలను తీసుకోవడం కొత్త పరిమాణం. మహేష్ బాబు ఈ విషయంలో అందరి కంటే ముందు ఉన్నాడు. అల్లు అర్జున్ డిమాండ్ కూడా బాగానే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సైతం రెండు మూడు ఉత్పత్తుల మార్కెటింగ్ లో భాగమయ్యాడు. సో స్టార్ హీరోలు హీరోయిన్లను కేవలం షూటింగ్ స్పాట్ లో మాత్రమే కాదు కొత్త స్టోర్ ఓపెనింగ్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా అక్కడకి వెళ్లి చూసుకోవచ్చు. ఉభయులకూ లాభం.