Begin typing your search above and press return to search.

లెక్క తేడా తెలిసే రూ.200 పెట్టే ధైర్యం చేయలేదా?

By:  Tupaki Desk   |   14 Feb 2020 12:08 PM GMT
లెక్క తేడా తెలిసే రూ.200 పెట్టే ధైర్యం చేయలేదా?
X
ప్రేక్షకులే మా దేవుళ్లు అంటూ చెప్పే తారల మాటల్లో నిజమెంతో వారి సినిమాలు విడుదలయ్యేసమయంలో ఫిక్స్ చేసే ధరను చూస్తేనే ఇట్టే అర్థమైపోతుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఆధారంగా కొందరు హీరోలు.. ప్రేక్షకుల్లో తమకున్న ఇమేజ్ ను ఆధారంగా చేసుకొని.. రెగ్యులర్ టికెట్ కు మించిన ధరను పెట్టేసి మొదటి రెండు వారాలు వసూలు చేసుకోవచ్చన్న వెసులుబాటు గురించి తెలిసిందే.

ఇవాల్టి రోజున సినిమా ఆయుష్షే వారం.. మహా అయితే రెండు వారాలు. మరీ క్రేజీ సినిమా అయితే మూడు వారాలు.కానీ.. మూడో వారం వచ్చేసరికి ఏదో ఒక సినిమా వచ్చేస్తుండటం.. మొదటి వారంలోనే సొమ్ము చేసుకోవాలన్న తలంపుతో భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ కావటం ఇప్పుడో అలవాటుగా మారింది. దీంతో.. ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ తో పాటు.. తమ సినిమాకు ధర పెంచినా చచ్చినా చూస్తారన్న ఆలోచనతో కొందరు నిర్మాతలు టికెట్ల ధరల్ని పెంచేస్తున్నారు. ఇలాంటివేళ.. తమను అభిమానించి.. ఆరాధించే ప్రేక్షకుల కోసమైనా సరే టికెట్ ధరల్ని పెంచొద్దన్న మాటను కొందరు హీరోలు అస్సలు చెప్పని పరిస్థితి.

మల్టీఫెక్సుల్లో రూ.138 ఉండే సినిమా టికెట్ ను కొన్ని సినిమాలకు రూ.200 చేసేశారు. అంటే.. ఒక టికెట్ మీద అదనంగా రూ.62 వసూలు చేస్తారన్న మాట. అదే రిక్లేనర్లకు అయితే.. వసూలు చేసే మొత్తం మరింత ఎక్కువగా ఉండే పరిస్థితి. ఇలాంటివేళ వచ్చిందే విజయ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్. యూత్ లో మాంచి క్రేజ్ ఉన్న ఈ నటుడి సినిమా అయినప్పుడు మిగిలిన వారి మాదిరి టికెట్ ధర రూ.200 ఫిక్స్ చేయాలి. కానీ.. అందుకు భిన్నంగా రూ.138 మాత్రమే ఫిక్స్ చేయటం ఆసక్తికరంగా మారింది.

దీనికి కారణం లేకపోలేదు. ఆ మధ్యన విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా టికెట్ సైతం రూ.200 వసూలు చేశారు. ఇలాంటివేళ.. రౌడీ సినిమా టికెట్ ధర రూ.200 అనుకున్న వారికి షాకిస్తూ రూ.138 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. దీంతో.. ఈ విషయాన్ని సైతం కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నట్లుగా విజయ దేవరకొండ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమా టికెట్ ధర పెంచితే తప్పు పడుతారు. అదే సమయంలో టికెట్ ధర పెంచకుండా మామూలుగా వసూలు చేస్తే.. సినిమా బాగోలేదని.. టికెట్ ధర పెంచితే ఓపెనింగ్స్ ను ప్రభావితం చేస్తాయన్న ఉద్దేశంతోనే తగ్గించి పెట్టారన్న ప్రచారం మంచిది కాదంటున్నారు. ఏమైనా.. యూత్ లో పిచ్చ క్రేజ్ ఉండే రౌడీ.. తన సినిమా టికెట్ ధరను పెంచే విషయంలో దూకుడు ప్రదర్శించకపోవటాన్ని ప్రశంసిస్తున్నా.. రూ.200కు ధైర్యం చేయకపోవటం ఏమిటి? అన్న క్వశ్చన్ కొందరి నోట వినిపిస్తోంది.