Begin typing your search above and press return to search.

ఆ హీరో కూడా ముఖ్యమంత్రేనట

By:  Tupaki Desk   |   10 July 2018 4:32 AM GMT
ఆ హీరో కూడా ముఖ్యమంత్రేనట
X
రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి ఉండదు. ప్రతి వ్యక్తి దైనందిన జీవితంతో ముడిపడిన విషయమది. ఆ నేపథ్యంలో సరిగ్గా సినిమాలే తీయాలే కానీ.. అవి అమితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. కానీ ఈ సినిమాల్ని డీల్ చేయడం అంత సులువు కాదు. అందులోనూ హీరోను పెద్ద రాజకీయ నేతగా.. పెద్ద పదవిలో చూపించి మెప్పించడం అంటే కత్తి మీద సామే. ఈ విషయంలో కొరటాల శివ ఇటీవలే మంచి విజయాన్నందుకున్నాడు. ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ బాబును ముఖ్యమంత్రిగా చూపించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. నిజానికి ఈ తరహా పాత్రలు చేయడానికి హీరోలు భయపడతారు. మహేష్ కూడా కొంచెం కంగారు పడ్డవాడే. కానీ కొరటాల జాగ్రత్తగా ఆ పాత్రను తీర్చిదిద్ది ప్రేక్షకుల ఆమోదం పొందాడు.

ఈ సినిమా చూశాక హీరోను ముఖ్యమంత్రి తరహా పాత్రల్లో చూపించడానికి మిగతా ఫిలిం మేకర్లకు.. ఆ టైపు పాత్రల్లో కనిపించడానికి హీరోలకు ధైర్యం వచ్చింది. ‘అర్జున్ రెడ్డి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ సైతం సీఎం పాత్రలో కనిపించబోతుండటం విశేషం. అతను ‘నోటా’ పేరుతో రాజకీయ నేపథ్యంలో తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో విక్రమ్ హీరోగా ‘ఇరుముగన్’ (తెలుగులో ఇంకొక్కడు) తీసిన ఆనంద్ శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ‘నోటా’ అనే టైటిల్ చూస్తేనే ఇది సమకాలీన రాజకీయాల నేపథ్యంలో సాగే సినిమా అని అర్థమైపోతుంది. ఇందులో విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడట. ఐతే పూర్తి స్థాయి క్యారెక్టరా లేక కాసేపు అలా ఆ పదవిలో కనిపిస్తాడా అనే విషయంలో క్లారిటీ లేదు. ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ కథానాయికగా నటిస్తోంది. మరి అల్లరి కుర్రోడి పాత్రలకు ఫేమస్ అయిన విజయ్.. ముఖ్యమంత్రి పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి.