Begin typing your search above and press return to search.

'ట్యాక్సీవాలా' ను వెంటాడుతున్న ఆ రెండు సినిమాలు

By:  Tupaki Desk   |   12 Nov 2018 8:14 AM GMT
ట్యాక్సీవాలా ను వెంటాడుతున్న ఆ రెండు సినిమాలు
X
వాయిదాల మీద వాయిదాలు పడ్డ విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘ట్యాక్సీవాలా’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. ఈ చిత్రం ఈ శనివారమే విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రి రిలీజ్ ఈవెంట్ చేసి.. థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇంతుముందు రిలీజ్ చేసిన టీజర్ కు.. దీనికి చాలా తేడా ఉంది. టీజర్ చూస్తే కథేంటన్నది అర్థం కాలేదు. కానీ ట్రైలర్లో స్టోరీ విడమరిచి చెప్పేశారు. సరైన ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న ఓ కుర్రాడికి అనుకోకుండా ఒక వింటేజ్ కారు లభిస్తుంది. దాంతో అతను ప్రేమలో పడిపోతాడు. కానీ తర్వాత ఆ కారు అతడిని ముప్పు తిప్పలు పెడుతుంది. ఆ కారులో దయ్యం ఉందని అతడికి తెలుస్తుంది. ఆ దయ్యం కథేంటన్నదే ‘ట్యాక్సీవాలా’ సినిమా.

ఈ రోజుల్లో ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా వస్తోందంటే.. ముందు దాన్ని ఎక్కడి నుంచి కాపీ కొట్టారా అని చూస్తున్నారు జనాలు. అలాంటిదేమైనా ఉంటే నిమిషాల్లో సోషల్ మీడియాలో వార్తలు వచ్చేస్తున్నాయి. ‘ట్యాక్సీవాలా’ విషయంలోనూ అదే జరుగుతోంది. ఇది కాపీ సినిమా అనే ఊహాగానాలు మొదలైపోయాయి. ఇలాగే కారులో దయ్యం ఉన్న కథలతో తెరకెక్కిన సినిమాలతో దీన్ని పోలుస్తున్నారు. 90ల్లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘క్రిస్టీన్’ ట్రైలర్ తో దీన్ని పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. అలాగే ఆ మధ్య వచ్చిన తమిళ సినిమా ‘డోర’తోనూ దీన్ని పోలుస్తున్నారు. ‘డోర’ కూడా కారు దయ్యం కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమానే. దాని విజువల్స్ ‘ట్యాక్సీవాలా’కు దగ్గరగా ఉన్నాయి. నిజానికి ‘డోర’ సైతం హాలీవుడ్ సినిమాల్ని కాపీ కొట్టి తీసిన సినిమానే. ఐతే కారులో దయ్యం అనే కాన్సెప్ట్ ని పట్టుకుని కాపీ అనేయడానికి కూడా వీల్లేదు. ఆ ఐడియా మాత్రమే తీసుకుని డిఫరెంట్ గా డీల్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఈ శనివారం మార్నింగ్ షో పడే వరకు కొంచెం వెయిట్ చేస్తే బెటర్.