Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ మాట నన్ను మార్చేసింది

By:  Tupaki Desk   |   12 Dec 2021 1:30 AM GMT
విజయ్ దేవరకొండ మాట నన్ను మార్చేసింది
X
విజయ్ దేవరకొండ జోడీగా ప్రియాంక జవాల్కర్ తన ఫస్టు సినిమాను చేసింది. 'టాక్సీవాలా' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ అమ్మాయి, మొదటి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఇక ఈ అమ్మాయి జోరు కొనసాగడం ఖాయమని అంతా అనుకున్నారు .. కానీ అలా జరగలేదు.

నిదానమే ప్రధానమన్నట్టుగా ఆమె ఒక్కో సినిమాను చేసుకుంటూ వెళుతోంది. ఆమె నటించిన 'తిమ్మరుసు' .. 'ఎస్.ఆర్. కల్యాణ మంటపం' సినిమాలు ఇటీవల చాలా తక్కువ గ్యాపులో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

'తిమ్మరుసు' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా, 'ఎస్.ఆర్. కల్యాణ మంటపం' సినిమా మాత్రం విజయాన్ని సాధించింది. ఒక రకంగా ప్రియాంక జవాల్కర్ కి ఈ సినిమా ఉపశమనాన్ని కలిగించింది.

ఆ తరువాత సినిమాగా 'గమనం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుజనారావు దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్ననే థియేటర్లకు వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాతో పాటు అనేక విషయాలను గురించి ప్రియాంక జవాల్కర్ మాట్లాడింది. 'టాక్సీవాలా' చేసిన తరువాత అవకాశాలు వస్తుండేవి. ఆ సినిమా విడుదలైన తరువాత ఇంకా మంచి అవకాశాలు వస్తాయని ఆగాను.

సాధారణంగా హీరోయిన్స్ ఎవరైనా చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. ఎందుకంటే హీరోయిన్స్ కి ఇండస్ట్రీ ఇచ్చే టైమ్ చాలా తక్కువ. అందువలన సాధ్యమైనంత తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.

మొదట్లో నేను కూడా అలాగే ఆలోచించే దానిని. ఫలానా ఫలానా హీరోలతో సినిమాలు చేసేయాలి. వాళ్ల సినిమాలకి నేను ఇంతవరకూ సైన్ చేయలేదే అని టెన్షన్ పడేదానిని. అదే విషయాన్ని నేను విజయ్ దేవరకొండతో అన్నాను. అప్పుడు నాతో విజయ్ దేవరకొండ ఒక మాట అన్నాడు.

"ఏ సినిమాకైనా కథనే హీరో. ఈ హీరోతో .. ఆ హీరోతో కాదు, మంచి కథలో చేయాలని అనుకో. అందుకోసం గట్టిగా ప్రయత్నించు" అని చెప్పాడు. ఆ మాటలు నాపై బాగా ప్రభావం చూపించాయి.

అప్పటి నుంచి కథలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాను. నాకు నచ్చిన కథలను చేసుకుంటూ వెళుతున్నాను. 'గమనం' కథ కూడా నాకు బాగా నచ్చింది. ఆ సినిమాలోని 'జారా' పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడున్న హీరోయిన్స్ లో నా రోల్ మోడల్ తాప్సీ. బాలీవుడ్ కి వెళ్లి తాను ఏమిటనేది నిరూపించుకుంది" అంటూ చెప్పుకొచ్చింది.