Begin typing your search above and press return to search.

'అర్జున్‌ రెడ్డి' పేరు చెప్పి బతికేయాలనుకోవడం లేదు

By:  Tupaki Desk   |   14 May 2019 10:30 PM GMT
అర్జున్‌ రెడ్డి పేరు చెప్పి బతికేయాలనుకోవడం లేదు
X
టాలీవుడ్‌ యంగ్‌ సెన్షేషన్‌ విజయ్‌ దేవరకొండ సినిమా సినిమాకు తన నటన ప్రతిభను పెంచుకుంటూ వెళ్తున్నాడు. తన ప్రతి సినిమాలో కూడా విభిన్నమైన వేరియేషన్స్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అందుకోసమే అర్జున్‌ రెడ్డి తర్వాత గీత గోవిందం - నోటా - ట్యాక్సీవాలా వంటి విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నటుడిగా తనకు తాను ఎప్పుడు కూడా సంతృప్తి చెందను అని - తన ప్రతి సినిమాలో కూడా మంచి నటన ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తానంటూ విజయ్‌ దేవరకొండ చెప్పుకొచ్చాడు. అర్జున్‌ రెడ్డి సినిమాలో విజయ్‌ దేవరకొండ నటన అద్బుతంగా ఉంటుంది. అయితే ఆ నటనను మించి నటించాలని తాను ప్రతిసారి భావిస్తానంటూ రౌడీ స్టార్‌ పేర్కొన్నాడు.

తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. అర్జున్‌ రెడ్డి సినిమాను నేను భవిష్యత్తులో చూసుకుంటే అదే నా ఉత్తమ యాక్టింగ్‌ చిత్రం అయితే నా కెరీర్‌ కు అర్థమే ఉండదు. అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అర్జున్‌ రెడ్డి పేరు చెప్పేసుకుని బతికేయాలని నేను కోరుకోవడం లేదు. నటనలో కొత్త విషయాలు తెలుసుకుంటూ - నిరంతరం కొత్తగా నటించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. నేను చేసే ప్రతి సినిమాకు కూడా ది బెస్ట్‌ నటన ఇవ్వాలని భావిస్తాను. నేను చేస్తున్న నా ప్రతి సినిమా కూడా అంతకు ముందు చేసిన సినిమాల కంటే బెటర్‌ గా ఉండాలని కోరుకుంటాను. గతంలో చేసిన సినిమాల పేర్లను చెప్పేసుకుని కెరీర్‌ ను నెట్టుకు వెళ్లాలని తాను కోరుకోవడం లేదంటూ రౌడీ చెప్పుకొచ్చాడు.

నా నుండి ప్రేక్షకులు ఎప్పుడు ఏం కోరుకుంటున్నారో అది వారికి ఇవ్వడం నా ముందు ఉండే లక్ష్యం. నా లక్ష్యం ప్రతి సినిమాకు పెద్దది అవ్వాలని నేను భావిస్తూ ఉంటాను అన్నాడు. కొన్ని సినిమాల్లో నటించిన మాదిరిగా అన్ని సినిమాల్లో చేయడం కష్టం - అదే కాకుండా కొన్ని సినిమాల్లో అంతకు మించి కూడా నటించడం సాధ్యం కాదు. కాని విజయ్‌ దేవరకొండ మాత్రం తన ప్రతి సినిమాను కూడా అంతకు మించి ఉండేలా ప్రయత్నిస్తానంటూ చెప్పడం అతడిలో ఉన్న ఉత్సాహంకు ప్రతీకగా చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంతో పాటు క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఒక చిత్రంను చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లో కూడా విజయ్‌ దేవరకొండ నటనలో అర్జున్‌ రెడ్డిని క్రాస్‌ చేస్తాడేమో చూడాలి. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. డియర్‌ కామ్రేడ్‌ చిత్రం జులై నెలలో రానుండగా - క్రాంతి మాధవ్‌ చిత్రం ఇదే ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.