Begin typing your search above and press return to search.

రౌడీ హీరో మార్క్ ప్రమోషన్..!

By:  Tupaki Desk   |   1 Nov 2019 2:13 PM IST
రౌడీ హీరో మార్క్ ప్రమోషన్..!
X
యువహీరో విజయ్ దేవరకొండ తన సినిమాలను ప్రమోట్ చేసే తీరు విభిన్నంగా ఉంటుంది.  మిగతా హీరోలు చేయని పనులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు.  సహజంగా హీరోలు.. నిర్మాతలు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తమ సినిమాలు ప్రదర్శింపబడుతున్న థియేటర్లను సందర్శిస్తూ ఉంటారు.. ప్రేక్షకులతో ముచ్చటిస్తూ ఉంటారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చాడు.

విజయ్ నిర్మాతగా మారి కింగ్ ఆఫ్ ది హిల్స్ బ్యానర్ పై నిర్మించిన 'మీకు మాత్రమే చెప్తా' ఈ రోజే రిలీజ్ అయింది.  ఈ సినిమాను ప్రదర్శిస్తున్న హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టిప్లెక్స్ ఆవరణలో టికెట్ కౌంటర్ లో కూర్చున్నాడు. క్యూలో ఉన్న ప్రేక్షకులకు టికెట్స్ అమ్మడం మొదలుపెట్టాడు.  రౌడీగారు స్వయంగా టికెట్స్ అమ్మడంతో జనాలు టికెట్స్ కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు.  సెల్ఫీలు.. ఫోటోలతో ఐమాక్స్ ప్రాంగణం కోలాహలంగా మారింది.  విజయ్ దేవరకొండ జస్ట్ టికెట్స్ మాత్రమే అమ్మేసి సరిపెట్టుకోకుండా టికెట్లు కొనుగోలు చేసినవారికి ఉచిత పాప్ కార్న్ అందించి సంతోషంలో ముంచెత్తాడు.

విజయ్ చేతులమీదుగా టికెట్స్ అందుకున్న ప్రేక్షకులు ఈ సంఘటనతో థ్రిల్లయ్యారు.  అంతే కాదు విజయ్ టికెట్స్ అమ్మిన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. హీరోగా నటించిన సినిమా అయినా.. నిర్మాతగా వ్యవహరించిన సినిమా అయినా విజయ్ తనదైన శైలిలో ఇలా పబ్లిసిటీ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది.