Begin typing your search above and press return to search.

కడుపు చెక్కలయ్యేలా నవ్వించిన దేవరకొండ

By:  Tupaki Desk   |   30 July 2018 9:35 AM IST
కడుపు చెక్కలయ్యేలా నవ్వించిన దేవరకొండ
X
విజయ్ దేవరకొండ మామూలోడు కాదని.. అతను మిగతా హీరోలకు చాలా చాలా భిన్నమని.. అతడి యాటిట్యూడే వేరని మరోసారి రుజువైంది. తన కొత్త సినిమా ‘గీత గోవిందం’ ఆడియో వేడుకలో అతను చేసిన రచ్చ అలాంటిలాంటిది కాదు. మామూలుగా హీరోలు తమ గురించి సోషల్ మీడియాలో జరిగిన ట్రోల్ గురించి మాట్లాడ్డానికే ఇష్టపడరు. అలాంటిది విజయ్.. తన మీద జరిగిన ట్రోల్ గురించి కేవలం మాటల్లో చెప్పడమే కాదు.. వీడియో రూపంలో చూపించి.. తనను జనాలు మామూలుగా ఏసుకోలేదంటూ తన మీద తనే జోకులు వేసుకోవడం విశేషం. ఇటీవలే ‘గీత గోవిందం’ కోసం విజయ్ ‘వాట్ ద ఎఫ్’ అంటూ ఒక పాట ఆలపించిన సంగతి తెలిసిందే. ఆ పాటలో అభ్యంతరకర వాక్యాలు ఉండటంతో అది వివాదాన్ని రాజేసింది. పైగా విజయ్ ఈ పాట పాడిన వైనంపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి.

దీంతో ఈ పాటను వెంటనే యూట్యూబ్ నుంచి తీసేయాల్సి వచ్చింది. విజయ్ మీద సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ నడిచింది. దాని గురించి విజయ్ ఆడియో వేడుకలో ప్రస్తావించాడు. తన సింగింగ్ జనాలకు నచ్చలేదని అర్థమైందంటూ తనపై వచ్చిన కామెడీ మీమ్స్‌ తో ఒక షో రీల్ వేశాడు. ‘మన్మథుడు’లో బ్రహ్మానందం-నాగ్ మధ్య పారిస్ ఎయిర్ పోర్టులో వచ్చే సీన్‌ ను గుర్తుకు తెస్తూ.. విజయ్ పాట ‘‘ఎలా ఉంది’’ అని అడిగితే.. ‘‘బాగుంది.. నువ్వు పాడకుంటే ఇంకా బాగుండేది’’ జనాలు అన్నట్లుగా క్రియేట్ చేసిన మీమ్ తో పాటు ఇలాంటివి మరికొన్ని వేసి చూపించారు. ఈ సందర్భంగా వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన బన్నీ సహా అందరూ పగలబడి నవ్వుకున్నారు. అనంతరం సుమ మైక్ అందుకుని నీ యాటిట్యూడ్ కి హ్యాట్సాఫ్.. ఇలా ఇంకే హీరో కూడా చేయలేడంటూ విజయ్ కి కితాబిచ్చింది.