Begin typing your search above and press return to search.

రాజ‌కీయాల్లోకి రా..ద‌ళ‌ప‌తి పై ఫ్యాన్స్ ఒత్తిడి!

By:  Tupaki Desk   |   21 Jun 2019 4:32 PM GMT
రాజ‌కీయాల్లోకి రా..ద‌ళ‌ప‌తి పై ఫ్యాన్స్ ఒత్తిడి!
X
త‌మిళ‌నాడు రాజ‌కీయాలు స్టార్ల రాక‌తో ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంగతి తెలిసిందే. త‌మిళ‌నాడులో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.. ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మల్ హాస‌న్ రాజ‌కీయాల్లోకి రావ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. అయితే ఆ ఇద్ద‌రి త‌ర్వాత మ‌ళ్లీ అంత‌టి ఛ‌రిష్మా ఉన్న క‌థానాయ‌కుడిగా ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ పేరు మార్మోగుతోంది. ర‌జ‌నీ కాంత్ త‌ర్వాత అంత‌టి ఫ్యాన్స్ విజ‌య్ .. అజిత్ ల‌కు మాత్ర‌మే ఉన్నారు. అందులో విజ‌య్ కి రాజ‌కీయంగానూ ప‌లుకుబ‌డి ఉంది. అత‌డి తండ్రి ఎస్.ఏ చంద్ర‌శేఖ‌ర్ త‌న కొడుకును ఉత్త‌మ‌ నాయ‌కుడిగా చూడాల‌నుంద‌ని చేసిన వ్యాఖ్య‌ల‌తో అభిమానుల్లో ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది.

ఆ త‌ర్వాత ఆ ఫీవ‌ర్ ని విజ‌య్ ఫ్యాన్స్ ప్ర‌తి వేదిక‌పైనా రాజేస్తున్నారు. త‌ళా విజ‌య్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని అభిమానుల నుంచి ఎంతో కాలంగా ఒత్తిడి ఉంది. ఈనెల 22న‌ ద‌ళ‌ప‌తి బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌మిళ‌నాడులోని ప‌లు న‌గ‌రాల్లో వీధి వీధినా వెల‌సిన క‌టౌట్లు.. ఫ్లెక్సీలు.. పోస్టర్లు వేడి పెంచుతున్నాయి. పోస్ట‌ర్ల‌పై ఫ్యాన్స్ ప్రజా సీఎం.. రేపటి సీఎం అంటూ ఆస‌క్తిక‌ర నినాదాల్ని ప్ర‌చురించ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. మ‌ధురై - కోయంబత్తూరు- తిరునల్వేలి వంటి నగరాల్లో అభిమానులు విజ‌య్ రాజ‌కీయారంగేట్రంపై అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తూ ప‌బ్లిగ్గా కొన్ని పోస్ట‌ర్ల తో హ‌ల్ చ‌ల్ చేశారు. మ‌ధురై నగరం అంతా ఎక్కడ చూసినా దళపతి రాజకీయల్లో రా.. అని పిలుపునిస్తూ పోస్టర్లు వేడెక్కించాయి. కొన్ని చోట్ల అయితే రేపటి సీఎం అంటూ... మరికొన్ని చోట్ల ప్రజా సీఎం అంటూ నినాదాల‌తో హోరెత్తించారు. అధికార పీఠం అధిరోహిద్దాం రా విజ‌య్! అంటూ ఫ్యాన్స్ పిలుపును ఇచ్చారు.

ఒక‌సారి రాజ‌కీయంగా విజ‌య్ గ‌తం ప‌రిశీలిస్తే.. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ తన మద్దతును అన్నాడీఎంకేకు ప్రకటించడం అభిమానుల్ని క‌ల‌త‌కు గురి చేసింది. అలాగే విజ‌య్ సోలోగా పార్టీ పెట్టాల‌న్న పంతం పెరిగింది అప్పుడే. నాటి ఎన్నికల్లో విజయ్‌ అభిమానులు జెండాలు చేత బట్టి మరీ స్వయంగా ప్రచారంలో పాల్గొన‌డంతో త‌న‌కు సినిమా రిలీజ్ ప‌రంగా చిక్కులేర్ప‌డ్డాయి. త‌ను నటించిన తలైవా చిత్రం చిక్కుల్లో పడింది. ఆ సినిమాని ర‌క‌ర‌కాల వివాదాలు చుట్టు ముట్టాయి. అప్ప‌టి నుంచే దళపతి రాజకీయాల్లోకి రా! అంటూ ఫ్యాన్స్ నిన‌దిస్తున్నారు. అప్ప‌టికి అభిమానుల్ని చ‌ల్ల‌బ‌ర్చేందుకు విజ‌య్ ఏదో ఒక‌టి చేస్తూనే ఉన్నాడు. అయితే 2014 బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీతో భేటీ అయిన విజ‌య్ రాజ‌కీయారంగేట్రంపై చ‌ర్చ సాగించార‌ని వార్త‌లొచ్చాయి. కానీ అదీ నిజం కాలేదు. 2018 ఎన్నిక‌ల వ‌ర‌కూ విజ‌య్ సైలెంటుగానే ఉన్నా.. త‌దుప‌రి ఎన్నిక‌ల‌కు మాత్రం సిద్ద‌మ‌వుతాడ‌ని చెబుతున్నారు. శనివారం విజయ్‌ 45వ వసంతంలోకి అడుగుపెట్టనున్న సంద‌ర్భంగా అత‌డి రాజకీయ ప్రవేశంపై ఏదైనా నిర్ణ‌యం వెలువ‌డుతుందా? అని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఉన్నారు. విజ‌య్ - అట్లీ కాంబినేష‌న్ తాజా సినిమా పోస్ట‌ర్లు రిలీజ‌య్యే వీలుంద‌ని తెలుస్తోంది.