Begin typing your search above and press return to search.

మెర్స‌ల్ కు మ‌తం రంగు...మండిప‌డ్డ విజ‌య్ తండ్రి!

By:  Tupaki Desk   |   24 Oct 2017 10:08 AM GMT
మెర్స‌ల్ కు మ‌తం రంగు...మండిప‌డ్డ విజ‌య్ తండ్రి!
X

మెర్స‌ల్‌-జీఎస్టీ డైలాగుల వివాదం రోజుకో కొత్త మ‌లుపు తిరుగుతోంది. ఆ సినిమాను పైర‌సీ వెర్షన్ చూశాన‌ని త‌మిళ‌నాడు బీజేపీ త‌మిళ‌నాడు అధ్య‌క్షుడు హెచ్ రాజా వివాదాస్పద ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. మెర్స‌ల్ కు మ‌తం రంగు పులిముతూ రాజా నిన్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హీరో విజయ్ క్రిష్టియ‌న్ గా మ‌తం మార్చుకున్నాడ‌ని - అందుకే ఆయ‌న మోదీకి - బీజేపీకి వ్య‌తిరేకంగా ఆ డైలాగులు చెప్పార‌ని ఆరోపించారు. అంతేకాకుండా, ఈ రోజు విజయ్ ఓటరు ఐడీ కార్డును (నెంబర్ టీఏయూ 1900109)ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెనుదుమారం రేపారు. ఆ ఓటర్ ఐడీలో విజయ్ పేరు జోసఫ్ విజయ్ అని ఉంద‌ని నిజాన్ని ఎవరూ దాచ‌లేర‌ని వ్యాఖ్యానించారు. ఆ ఐడీతోపాటు విజ‌య్ అఫీషియ‌ల్ లెట‌ర్ హెడ్ ను కూడా పోస్ట్ చేశారు. మెర్స‌ల్ సినిమాలోని డైలాగ్ ల‌ను రాజా ఉద‌హ‌రించారు. "దేవాలయాల కన్నా ముందు ఆసుపత్రులను నిర్మించాలి" అని విజ‌య్‌ ప్రస్తావించార‌ని మండిప‌డ్డారు. చ‌ర్చిల క‌న్నా ముందు ఆసుప‌త్రుల‌ను నిర్మించాల‌ని విజ‌య్ చెప్పి ఉండాల్సింద‌న్నారు. విజ‌య్‌....హిందువుల‌ను రెచ్చ‌గొట్టాల‌ని చూస్తున్నార‌ని చెప్పారు.

రాజా వ్యాఖ్య‌ల‌పై విజయ్ తండ్రి చంద్ర‌శేఖ‌ర‌న్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడి పేరు జోసఫ్‌ విజయ్‌ అని, ఆ పేరులో తప్పేముంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తన పేరు చంద్రశేఖ‌ర్‌ అని, అది శివుడి పేరని తెలిపారు. విజయ్‌ క్రిస్టియనో - ముస్లిమో - హిందువో కాదని స్పష్టం చేశారు. విజయ్ ఒక మనిష‌ని - అంతకుమించి భారతీయుడని ఆయన అన్నారు. ప్రజలకు సేవచేసేందుకు విజయ్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. రాజ‌కీయాల‌పై విజయ్ నిర్ణయమే అంతిమమని, ఆ విష‌యం గురించి తాను బలవంతం చేయనన్నారు. ‘మెర్సల్‌’ సినిమాలో చర్చనీయాంశమైన అంశాలను తొలగించేందుకు నిర్మాత ఒప్పుకున్న‌ తరువాత కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేద‌ని రాజాపై ఆయ‌న మండిప‌డ్డారు.

మ‌రోవైపు రాజా వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. జీఎస్టీ డైలాగులు అభ్యంత‌ర‌క‌రమ‌ని వివాదాన్ని మొద‌లుపెట్టిన బీజేపీ చివ‌ర‌కు దానికి కూడా మ‌తం రంగు పులిమి రాజ‌కీయం చేస్తోంద‌ని సోష‌ల్ మీడియాలో తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ముందుగానే దేవాల‌యాలు...డైలాగులు అంశాన్ని బీజేపీ ఎందుకు లేవ‌నెత్తలేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఆ సినిమాలో హీరో విజ‌య్ ఒక హిందువుగానే ఆ డైలాగులు చెప్పాడ‌ని నెటిజ‌న్లు గుర్తు చేస్తున్నారు. 2016 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు.... మోదీ-విజ‌య్ ల ఫొటోలతో సోష‌ల్ మీడియాను హోరెత్తించిన బీజేపీ నేత‌లు ఇపుడు ఈ విధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌న్నారు. బీజేపీ ద్వంద్వ నీతికి ఇది నిలువెత్తు నిద‌ర్శ‌న‌మ‌ని మండిప‌డుతున్నారు. ప్ర‌భుత్వ విధానాల‌ను, వాటిలోని లోపాల‌ను ఎవ‌రన్నా ప్ర‌శ్నిస్తే వారి గొంతు నొక్క‌డానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేయ‌డం, అది కుద‌ర‌ని ప‌క్షంలో చివ‌ర‌కు ఆ వ్య‌క్తుల‌కు, సంబంధిత అంశాల‌కు మ‌తం రంగు పులిమి మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్ట‌డం బీజేపీకి అల‌వాటేన‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. సినిమా వివాదాన్ని అంత‌వ‌ర‌కే చూడాల‌ని, విజ‌య్ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను బ‌య‌ట‌పెట్టే హ‌క్కు ఎవ‌రికీ లేద‌ని అంటున్నారు.