Begin typing your search above and press return to search.

విజయ్ - సామ్ కాంబోలో #VD11 ప్రారంభం..!

By:  Tupaki Desk   |   21 April 2022 4:29 AM GMT
విజయ్ - సామ్ కాంబోలో #VD11 ప్రారంభం..!
X
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనుందని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని బ్యాంక్ రోల్ చేయడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. అయితే ఇన్నాళ్లకు ఈ మూవీ కార్యరూపం దాల్చింది. ఈరోజు (ఏప్రిల్ 21) గురువారం ఉదయం #VD11 చిత్రాన్ని లాంచ్ చేశారు.

హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ క్లాప్ కొట్టగా.. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ వేడుకకు హీరో విజయ్ దేవరకొండ తో పాటుగా దర్శకనిర్మాతలు హాజరయ్యారు. ఏప్రిల్ 23 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం.

ఇందులో విజయ్ జోడీగా స్టార్ హీరోయిన్ సమంత నటించనుంది. గతంలో ఈ జంట 'మహానటి' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి కలిసి నటిస్తుండటంతో ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇది కాశ్మీర్ నేపథ్యంలో జరిగే ప్రేమ కథ అని టాక్ వినిపిస్తోంది. దీనికి 'ఖుషీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

ఇందులో విజయ్ ఆర్మీ మ్యాన్ గా.. సామ్ ఒక కశ్మీర్ అమ్మాయిగా కనిపించనున్నారని అంటున్నారు. 'వరల్డ్ ఫేమస్ లవర్' తర్వాత ఇక లవ్ స్టొరీలలో నటించనని VD స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాకపోతే ఇప్పుడు శివ నిర్వాణ ఒక వైవిధ్యమైన ప్రేమ కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

నిర్మాతలు నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. 'డియర్ కామ్రేడ్' తర్వాత మైత్రీ బ్యానర్ లో వీడీ నటిస్తున్న రెండో సినిమా ఇది. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్, 'హృదయం' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. జి మురళి సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

ఇకపోతే విజయ్ దేవరకొండ ఇప్పటికే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. ఆగస్ట్ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవలే ఈ క్రేజీ కాంబోలో 'జనగణమన' అనే మరో పాన్ ఇండియా చిత్రాన్ని ప్రారంభించారు. ఇప్పుడు శివ నిర్వాణతో సినిమా షురూ చేశారు. విజయ్ #VD11 మరియు 'JGM' సినిమాలని ప్యారలల్ గా పూర్తి చేసే అవకాశం ఉంది.