Begin typing your search above and press return to search.

విజయ్ సేతుపతి.. ఓ నటుడు!

By:  Tupaki Desk   |   1 Feb 2021 12:30 AM GMT
విజయ్ సేతుపతి.. ఓ నటుడు!
X
ఏ సినిమా ఇండ‌స్ట్రీలోనైనా హీరోలు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా ఉంటారు.. కానీ, న‌టులు కొద్ది మందే ఉంటారు! హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ‘హీరోలు’ అడుగడుగునా కనిపిస్తారు. కానీ.. పాత్రను ఎలివేట్ చేసే ‘నటులు’ అక్కడక్కడ మాత్రమే తారస పడుతుంటారు. అందుకే.. ప్రతీ ఇండస్ట్రీలో ఒక నటుడు కనిపిస్తుంటాడు. ప్రతీ దర్శకుడకి అతడో ఛాయిస్. ఎందుకంటే.. పలానా పాత్రను ఆయన మాత్రమే చేయగలడు అని దర్శకులు ‘రాసి పెట్టుకుంటారు.’ అలాంటి హీరోకాని నటుడు విజయ్ సేతుపతి!

అమీర్ ఖాన్ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని కాంటాక్ట్ అయ్యారు.. ‘పుష్ప’ సినిమాలో సుకుమార్ తీసుకోవాల‌నుకున్నాడ‌ట‌.. స‌లార్ లో ప్ర‌భాస్ ప్ర‌త్య‌ర్థిగా అనుకుంటున్నార‌ట‌.. ఇంకా పలు సినిమాల్లో తీసుకోవాలని చూస్తున్నారట. టాలీవుడ్, బాలీవుడ్లోనే కాదు.. చాలా ఇండస్ట్రీల్లోని చాలా పాత్రలకు విజయ్ సేతుపతి ఛాయిస్ కాదు.. ఒన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అవుతున్నాడు. ఎందుకంటే.. ముందుగా చెప్పుకున్నట్టు అతను హీరోగా నటించినప్పటికీ హీరో కాదు. నవరసాలు పలికించే అద్భుతమైన నటుడు.

తమిళనాడులోని రాజపాల్యెంలో జ‌న్మించాడు విజయ్‌. ఆరో తరగతి చదువుకునే నాటికి వారి కుటుంబం చెన్నైకి వలస వెళ్లింది. పదహారేళ్లప్పుడు ఏదో సినిమా ఆడిషన్స్‌లో పాల్గొన్నాడు కానీ విఫలమయ్యాడు. ఆ తరవాత సినిమా ఊసుల్ని మరచిపోయి బతుకు బాటలో ముందుకు కదిలాడు. కామర్స్ లో డిగ్రీ చదివాడు. ఆ తర్వాత అవసరాల కోసం ఎన్నో ఉద్యోగాలు చేశాడు. షాపులో సేల్స్‌మ్యాన్‌గా, ఫోన్‌ బూత్‌ ఆపరేటర్‌గా, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లోనూ పని చేశాడు. అవసరం తరమడంతో.. దుబాయి కూడా వెళ్లాడు. నచ్చకపోవడంతో 2003లో తిరిగి వచ్చాడు. స్నేహితులతో కలిసి ఇంటీరియర్‌ డిజైనింగ్‌ సంస్థని స్థాపించాడు. కానీ.. పూర్తిగా మనసు పెట్టలేకపోయాడు. రెడీమేడ్‌ కిచెన్లు రూపొందించే మార్కెటింగ్‌ సంస్థలో కొంత కాలం చేశాడు. ఎక్కడా మనసు నిలవట్లేదు.. కారణం ఏదో ఉంది!

కాలం తిరిగింది.. ఓ నాటక సంస్థలో అకౌంటెంట్‌గా చేరాడు. చిన్న చిన్న పాత్ర‌లూ చేసేవాడు. ఇతర నటుల్ని దగ్గర నుంచి గమనించడం మొదలుపెట్టి నటనలో మెళకువలు తెలుసుకోవడం ప్రారంభించాడు. చూస్తుండ‌గానే అయిదేళ్లు గ‌డిచిపోయాయి. అప్పుడు అర్థ‌మైంది.. త‌న మ‌న‌సుకు ఏం కావాలో! అర్థ‌మైపోయింది. తాను న‌టున్ని కావాలి అనుకున్నాడు. దాన్నే కెరీర్‌గా మార్చుకోవాలని డిసైడ్ అయ్యాడు.

తన గురించి ఓ చక్కటి బయోడేటా రూపొందించి తనను తాను మార్కెటింగ్‌ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఒకానొకప్పుడు దర్శకుడు బాలూ మహేంద్ర ‘నీది ఫోటోజెనిక్‌ ఫేస్‌’ అన్న మాటల్ని గట్టిగా పట్టుకున్నాడు. సినిమాలే జీవితంగా సాగాలని విశ్వప్రయత్నం చేశాడు. ‘ఎం.కుమరన్‌ సన్‌ ఆఫ్‌ మహాలక్ష్మి’ చిత్రంలో బాక్సింగ్‌ క్రీడ వీక్షకుడిగా తెరంగేట్రం చేశాడు. అవ‌కాశాలు ఒకేసారి ద‌క్క‌వు క‌దా.. తొలి అయిదేళ్లు చిన్నా చితాకా పాత్రల్లోనే న‌టించాడు. ఈ క్ర‌మంలో షార్ట్‌ ఫిల్మ్స్‌లోనూ చేశాడు. 2010లో ‘తెన్‌మెర్కు పరువకాట్రు’ లో ప్రధాన పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఆ త‌ర్వాత‌ ‘సుందరపాండియన్‌’ సినిమాలో విలన్‌గా చేశాడు. అయితే.. 2012లో విడుద‌లైన‌ ‘పిజ్జా’ మూవీ సేతుప‌తికి మంచి పేరుతెచ్చింది. ఆ త‌ర్వాత‌ నుంచి అతడి కెరీర్ ఊపందుకుంది.

విభిన్నమైన పాత్రలు చేస్తూ విలక్షణమైన నటనను క‌న‌బ‌ర‌చ‌డం మొద‌లు పెట్టాడు విజయ్‌ సేతుపతి. పాత్ర‌ నచ్చితే చాలు పరిధి ఎంతనేది కూడా చూసుకోడు. మెలోడ్రామా, యాక్షన్‌, రొమాన్స్‌, కామెడీ అన్నీ చేశాడు. మధ్య తరగతి యువకుడి పాత్రల్లో ఎక్కువ చేశాడు. చాలా మంది కొత్త డైరెక్టర్లతో చేశాడు. మంచి మంచి విజ‌యాలు ద‌క్కాయి. అయినాకానీ.. కాల‌ర్ ఎగ‌రేయ‌లేదు. తాను న‌టుడిని అనే గుర్తుంచుకున్నాడు. అందుకే హీరోగా చేసిన‌ప్ప‌టికీ.. విల‌న్ గా సిద్ధ‌మ‌వుతాడు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుకూ రెడీ అంటాడు.

ఇంత అద్భుత‌మైన న‌టుడికి మహిళాభిమానులు ఎక్కువ. ఇదే విష‌యం త‌న వ‌ద్ద ప్ర‌స్తావిస్తే.. ‘నేను అందంగా ఉండను. మంచి రంగూ కాదు.. అయినా నన్నెందుకు ఇష్టపడతారో?’అంటూ న‌వ్వుతుంటాడు సేతుప‌తి. ఇమేజ్ చ‌ట్రాల‌కు.. భ‌జ‌న‌ల‌కు విజ‌య్ సేతుప‌తి దూరం. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండే త‌త్వం. అందుకే.. తెర‌వెన‌క‌, తెర ముందూ ఆయ‌న‌కు అభిమానులు ఉంటారు. అయితే.. ఈ పేరుతో అభిమాన సంఘాలు పెడ‌తానంటే మాత్రం ఒప్పుకోడు. త్వ‌ర‌లో విజయ్‌ సేతుపతి విలన్‌గా చేసిన ‘ఉప్పెన’ తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో న‌ట‌న ఎలా ఉంటుందో చూడాలి.

ఇక‌, విజ‌య్ ప‌ర్స‌న్ విష‌యాల్లోకి వెళ్తే.. జెస్సీ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జెస్సీ చెన్నైలోనే పుట్టిపెరిగిన మలయాళీ అమ్మాయి. విజ‌య్ సినిమాల్లోకి రాకముందే వీళ్లకు పెళ్లైయింది. అయితే.. వీళ్ల ప్రేమ చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. విజయ్‌ దుబాయిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆన్‌లైన్‌లో పరిచయం అయింది జెస్సీ. ఆమె కూడా అక్కడే పనిచేస్తుండేది. ఇద్దరి అభిరుచులు కలవడంతో చాటింగ్‌లో మునిగిపోయేవారు. కానీ.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు ఇరుపక్షాల పెద్దలూ ఒప్పుకోలేదట. అయినా.. తీవ్రంగా ప్రయత్నించి ఆఖరుకి విజయం సాధించారు.

నిశ్చితార్థం రోజునే మొదటిసారి ప్రత్యక్షంగా కలుసుకుంద‌ట ఈ జంట‌! సినిమాల్లో అవకాశాలు లేక అల్లాడుతున్న సమయంలో జెస్సీ అండగా నిలిచిందని, తన విజయ రహస్యం ఆమేనని చెబుతుంటాడు విజ‌య్‌. వీరికి ఓ బాబు, పాప ఉన్నారు. సినిమాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో స‌త్తా చాటుకునే విజ‌య్‌.. ఆఫ్ ది స్క్రీన్ మాత్రం కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ గా ఉంటాడు.