Begin typing your search above and press return to search.

జాతీయ ఉత్తమ నటుడు ఇలాంటి పాత్రలు చేయడమేంటి..?

By:  Tupaki Desk   |   4 Jun 2022 12:30 AM GMT
జాతీయ ఉత్తమ నటుడు ఇలాంటి పాత్రలు చేయడమేంటి..?
X
కెరీర్ ప్రారంభంలో క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించిన విజయ్ సేతుపతి.. తర్వాతి రోజుల్లో తన విలక్షమైన నటనతో తమిళనాట మక్కల్ సెల్వన్ గా పిలుచుకునే స్థాయికి ఎదిగారు. ఈ క్రమంలో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నారు. ఏడాది పొడవునా బిజీగా ఉండే సేతుపతి.. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే గత కొంతకాలంగా తన రేంజ్ కు తగ్గ పాత్రలను ఎంచుకోవడం లేదనిపిస్తోంది.

నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికి అయినా సేతుపతి సిద్ధంగా ఉంటారు. ఒకే భాషలో అటు హీరోగా ఇటు విలన్ గా నటించడం.. ఆడియన్స్ మెప్పు పొందడం టాలెంటెడ్ యాక్టర్ కు మాత్రమే చెల్లింది. అయితే ఇప్పుడు 'విక్రమ్' సినిమాలో విలక్షణ నటుడు చేసిన పాత్ర చూస్తే.. ఇలాంటి బి గ్రేడ్ విలన్ రోల్ చేయడానికి ఎలా ఒప్పుకున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

'మాస్టర్' సినిమాలో పూర్తి స్థాయి ప్రతినాయకుడిగా నటించినప్పటికీ.. హీరోతో ఈక్వల్ గా ఉండే పాత్ర కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఇప్పుడు కమల్ హాసన్ సినిమాలో మాస్ లోకల్ విలన్ గా కనిపించడం.. సెకండ్ హాఫ్ లో ఆ పాత్ర ప్రాధాన్యం తగ్గించేయడంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురవుతున్నారు. క్లైమాక్స్ లో రెగ్యులర్ విలన్ క్యారక్టర్ గా చంపేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇటీవల కాలంలో విజయ్ సేతుపతి నటించిన 'లాభమ్' 'అన్నాబెల్లె సేతుపతి' 'తుగ్లక్ దర్బార్' వంటి సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేదు. 'కన్మణి రాంబో ఖతీజా' మూవీ కూడా ఓ మోస్తరు విజయాన్నే రాబట్టింది. ఇప్పుడు ''విక్రమ్'' సినిమాలో కమల్ హాసన్ - ఫహాద్ ఫాజిల్ పాత్రలకు వస్తున్న స్థాయిలో సేతుపతి కి ప్రశంసలు దక్కడం లేదు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరీ బి గ్రేడ్ విలన్ గా చూపించారని ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.

డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సేతుపతి.. 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో తళుక్కున మెరిసాడు. ఇది ఎలాంటి ప్రాధాన్యత లేని అతిథి పాత్ర అనే అనుకోవాలి. ఈ క్రమంలో 'ఉప్పెన' చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో మెప్పించారు. కాకపోతే '96' వంటి క్లాసిక్స్ తో ఎంతో పేరు తెచ్చుకుని కూడా.. దాన్ని నిలబెట్టుకునేలా క్యారక్టర్స్ ఎంపిక చేసుకోవడం లేదనే అభిమానులు ఫీల్ అవుతున్నారు. వర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు ఉన్న సేతుపతి.. ఇప్పటి నుంచైనా మంచి పాత్రలు చేయాలని కోరుకుంటున్నారు.

ఇకపోతే విజయ్ సేతుపతి ప్రస్తుతం 'మామనితనం' 'విడుదలై' వంటి తమిళ చిత్రాలలో నటిస్తున్నారు. అలానే '19(1)(ఏ) అనే మలయాళ మూవీతో పాటుగా.. 'ముంబైకార్' 'గాంధీ టాక్స్' వంటి హిందీ సినిమాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ తో కలిసి 'మేరీ క్రిస్మస్' అనే మూవీలో నటిస్తున్నారు. ఇక షాహిద్ కపూర్ తో 'ఫర్జీ' అనే వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు.