Begin typing your search above and press return to search.

రాజ‌కీయాల్లో నా సెకండాఫ్ చూస్తారు!-విజ‌య‌శాంతి

By:  Tupaki Desk   |   29 Oct 2019 8:03 AM GMT
రాజ‌కీయాల్లో నా సెకండాఫ్ చూస్తారు!-విజ‌య‌శాంతి
X
ద‌శాబ్ధాల పాటు లేడి సూప‌ర్ స్టార్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన విజ‌య‌శాంతి ఆ త‌ర్వాత రాజ‌కీయాలు ఉద్య‌మాలు అంటూ కొత్త దారిలోకి వెళ్లారు. ప్ర‌స్తుతం స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. అయితే రాజ‌కీయాల్లో స‌క్సెస‌య్యార‌ని అనుకుంటున్నారా? రాజ‌కీయాల్లో ఉద్య‌మాల్లో అనుభ‌వం ఏమిటి? అన్న‌ది ఓ చిట్ చాట్ లో ఎక్స్ క్లూజివ్ గా ముచ్చ‌టించారు.

రాజ‌కీయాల్లో సాధించింది ఎంత‌? అని ప్ర‌శ్నిస్తే.. మీరు అనుకున్న‌ది సాధించ‌క‌పోయినా నేను అనుకున్న‌ది సాధించాన‌ని అంటున్నారు. ``1998 జ‌న‌వ‌రి 26న ఉద్య‌మంలోకి వ‌చ్చాను. ఏదైతే ల‌క్ష్యం అనుకున్నానో అది సాధించాను. రాజ‌కీయాల్లోకి వ‌చ్చాం డ‌బ్బు సంపాదించాం... ఇవ‌న్నీ కాదు. ఇక్క‌డ‌ ఎన్నో ఆశ‌లు చూపారు. అయితే విజ‌య‌శాంతి ఆలోచ‌న‌ అది కాదు. ఉద్య‌మం సాధించుకోవ‌డం. తెలంగాణ నాకు ముఖ్యం. అది సాధించాను`` అని అన్నారు. ఒక నిర్ణ‌యం తీసుకుంటే సాధించేవ‌ర‌కూ వ‌దిలిపెట్ట‌నని తెలిపారు.

మీరు క‌లిసి ప‌ని చేసిన పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావాల్సొచ్చింది క‌దా? అని ప్ర‌శ్నిస్తే.. నేను ఉద్య‌మం ప్రారంభించిన‌ప్ప‌టికి టీఆర్‌ ఎస్ పార్టీనే లేదు. నేను అప్ప‌టికే ఉద్య‌మంలో ఉన్నాను. రెండు రాష్ట్రాలు ఉంటే రెండూ అభివృద్ధి చెందుతాయ‌నే మంచి ఆలోచ‌న‌తోనే ఉద్య‌మం చేశాను. టీఆర్ ఎస్ స్వార్థం కోసం ఉద్య‌మం చేసింది. విభ‌జ‌న స‌మ‌యంలో ఉద్వేగాలు తారాస్థాయికి చేరాయి. అయితే విభ‌జ‌న‌ అనంత‌రం మ‌నుషుల మ‌ధ్య విభేధాలు చెరిగిపోయి ప్ర‌శాంతంగా ఉంది ఇప్పుడు. నేల విడిపోయినా మ‌నుషులు విడిపోలేం. ఆ ప్రేమాప్యాయ‌త‌లు పోవు.. అని చెప్పుకొచ్చారు.

సినిమాల్లో విజ‌యం .. శాంతి వ‌చ్చాయి? రాజ‌కీయాల్లో అవి ద‌క్క‌లేదు క‌దా? అని ప్ర‌శ్నిస్తే..అధికారంలోకి వ‌స్తే శాంతిని ఇస్తాం. ``రాజ‌కీయాల్లో ఫ‌స్టాఫ్ మాత్ర‌మే అయ్యింది... సెకండాఫ్ చూస్తారు`` అని వ్యాఖ్యానించారు. అక్క‌డ‌ అనుకున్న‌ది సాధించాను. ఉద్య‌మం గెలుచుకున్నా. మీర‌నుకున్న‌ది ప‌వ‌ర్. అది త‌ర్వాత వ‌స్తుంది అని అన్నారు.

రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక ఎన్నిసార్లు అరెస్ట‌య్యారు? అన్న ప్ర‌శ్న‌కు ఉద్య‌మాలు.. రాజకీయాలు.. అరెస్టులు .. నిరంత‌ర ఖైదీలానే అనిపించేదని వ్యాఖ్యానించారు. జైలు జీవితం.. పోరాటాల అనుభ‌వంపై ప్ర‌శ్నిస్తే.. జైల్లో నిద్ర ఉండేది కాదు... ఖైదీల‌తో పాటు ఉండాల్సొచ్చేద‌ని అన్నారు. ``చంచ‌ల‌గూడ సెంట్ర‌ల్ జైల్లో ఖైదీల‌తో కూచున్న అనుభ‌వాలున్నాయి. అక్క‌డేమీ రాయ‌ల్ ట్రీట్ మెంట్ ఉండ‌దు. కోర్టులు జ‌డ్జిలు ఇవ‌న్నీ ఉంటాయి. సినిమాల్లోలా యువ‌రానర్ అంటూ కోర్టులో ప‌గ‌ల‌గొట్ట‌డాలు అవీ ఉండ‌వు. రాజ‌కీయాలంటే సినిమాల‌లో చూపించిన‌ట్టే. లాగి విసిరి జీప్ లో వేయ‌డం.. అరెస్టు చేయ‌డం.. అన్నీ చూశాను రాజ‌కీయాల్లో... అని విజ‌య‌శాంతి తెలిపారు.