Begin typing your search above and press return to search.

‘విజిల్’ ను మనోళ్లెందుకు నెత్తిన పెట్టుకోవాలి?

By:  Tupaki Desk   |   24 Oct 2019 1:30 AM GMT
‘విజిల్’ ను మనోళ్లెందుకు నెత్తిన పెట్టుకోవాలి?
X
తమిళ డబ్బింగ్ సినిమాల్ని మనవాళ్లు నెత్తిన పెట్టుకోవడం.. వసూళ్ల వర్షం కురిపిస్తుండటం ఎప్పట్నుంచో చూస్తున్నాం. ‘బాషా’ - ‘నరసింహా’ - ‘అపరిచితుడు’ - ‘గజిని’ - ‘శివాజీ’ - ‘రోబో’.. ఇలా తెలుగులో వసూళ్ల మోత మోగించిన డబ్బింగ్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ మీడియం రేంజి హీరోలకు కూడా తెలుగులో మంచి మార్కెట్ ఇచ్చిన పెద్ద మనసు మనవాళ్లది. ఏ బేషజం లేకుండా వాళ్ల సినిమాల్ని మనోళ్లు చూస్తారు. ఈ మధ్య తమిళ అనువాదాల జోరు తగ్గింది కానీ.. గతంలో అయితే మన సినిమాలకే ముప్పుగా పరిణమించాయి అరవ డబ్బింగ్ సినిమాలు. అయినా వాటిని కట్టడి చేయడానికి ఎప్పుడూ ప్రయత్నాలు జరగలేదు. మీడియా కూడా అనువాదాలకు అండగా నిలుస్తూనే వస్తోంది. అయితే మన సినిమాలకు మాత్రం తమిళంలో ఇలాంటి ఆదరణ దక్కదు.

తెలుగు అనే కాదు.. ఏ పరభాషా చిత్రం అనువాదమై తమిళంలోకి వచ్చినా ఇండస్ట్రీ నుంచి పెద్దగా సహకారం ఉండదు. సరైన సంఖ్యలో థియేటర్లు ఇవ్వరు. మీడియా సంగతి చెప్పాల్సిన పనే లేదు. పూర్తిగా ఇగ్నోర్ చేస్తాయి. తీసి పడేసేలా వ్యాఖ్యలు చేస్తారు అక్కడి మీడియా వాళ్లు. ‘బాహుబలి’కి విపరీతమైన హైప్ వచ్చి - జనాలకు ఎంతగానో నచ్చేయడం వల్ల కోలీవుడ్ జనాలు - మీడియా వాళ్లు దాన్ని అనివార్యంగా మోయక తప్పలేదు. కానీ దానికి ముందు, వెనుక మన అనువాదాల్ని అక్కడి జనాలు పెద్దగా పట్టించుకున్నది లేదు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమాపై విపరీతమైన నెగెటివిటీ నడిచింది. మీడియా వాళ్లు మూకుమ్మడిగా ఆ సినిమాపై పడ్డారు. ‘సాహో’కు బేసిగ్గానే నెగెటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఓకే అనుకుందాం.

చిరంజీవి సినిమా ‘సైరా నరసింహారెడ్డి’కి పాజిటివ్ టాక్ వచ్చినా తమిళంలో ఆడలేదు. అక్కడి మీడియా దాన్ని లేపే ప్రయత్నం చేయలేదు. సినిమాను అనుకున్న విధంగా రిలీజ్ చేయడం కూడా కష్టమైంది. తమిళ జనాలు ఆ సినిమాను అసలు పట్టించుకోనే లేదు. కానీ మనవాళ్లు మాత్రం ఇలాంటి తేడాలు చూపించరు. విజయ్ కొత్త సినిమా ‘విజిల్’కు తెలుగులో భారీ రిలీజ్ దక్కుతోంది. పెద్ద ఎత్తున థియేటర్లిస్తున్నారు. మీడియా సహకరిస్తోంది. జనాలు కూడా ఏ భేషజం లేకుండా సినిమా చూసేందుకు రెడీగా ఉన్నారు. ఐతే ‘సాహో’ - ‘సైరా’ సినిమాలకు తమిళంలో వచ్చిన ఫలితం చూశాక పెద్ద హీరోల అభిమానులు.. వాళ్లు మన సినిమాల్ని పట్టించుకోనపుడు మనమెందుకు వాళ్ల చిత్రాల్ని నెత్తిన పెట్టుకోవాలి.. ‘విజిల్’ సినిమాకు ఇంత సహకారం - బజ్ ఎందుకు అని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.