Begin typing your search above and press return to search.

'రాణి రుద్ర‌మ‌దేవి' ఆగిపోవ‌డానికి కార‌ణం?

By:  Tupaki Desk   |   30 Oct 2019 1:30 AM GMT
రాణి రుద్ర‌మ‌దేవి ఆగిపోవ‌డానికి కార‌ణం?
X
అనుష్క క‌థానాయిక‌గా గుణ‌శేఖ‌ర్ `రుద్ర‌మ‌దేవి` (2015) చిత్రం తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా ప్రారంభం కాక‌ముందే విజ‌య‌శాంతి టైటిల్ పాత్ర‌లో రాణి రుద్ర‌మ‌దేవి సినిమా తెర‌కెక్కుతుంద‌ని ప్ర‌చార‌మైంది. అయితే అది రక‌ర‌కాల కార‌ణాల‌తో మెటీరియ‌లైజ్ కాలేదు. అస‌లు ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అవ్వ‌డానికి కార‌ణ‌మేమిటి? అన్న‌ది తెలియ‌రాలేదు ఇంత‌వ‌ర‌కూ. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతినే ఈ ప్ర‌శ్న అడిగేస్తే ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు.

సినిమాల నుంచి దూరంగా వెళ్లి 13 ఏళ్ల గ్యాప్ తీస్కున్నారు. న‌ట‌న‌కు దూర‌మై రాజ‌కీయాల్లోకి వెళ్లారు. ఈ మ‌ధ్య‌లో మ‌ళ్లీ న‌టించాలి అన్న ఆలోచ‌న ఎప్పుడైనా వ‌చ్చిందా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా `రాణి రుద్ర‌మ‌దేవి` సినిమా చేద్దామ‌ని క‌థ‌పై ప‌రిశోధించామ‌ని తెలిపారు. ``మ‌ళ్లీ ఎంట్రీ ఇస్తే .. అలాంటి సినిమాతో ప్ర‌వేశించాలి అనుకున్నాను. క‌థ మేమే రెడీ చేసుకున్నాం. అప్ప‌టికి వేరే సినిమాల ఆలోచ‌న లేదు. వ‌చ్చిన అవ‌కాశాల‌న్నీ రాజ‌కీయాల్లో .. ఉద్య‌మంలో సీరియ‌స్ నెస్ వ‌ల్ల ఏదీ అంగీక‌రించ‌లేద``ని తెలిపారు.

రుద్ర‌మ‌దేవి క‌థ అంటే ఏ కాలంలో జ‌రిగిన క‌థ‌ను అనుకున్నారు? అని ప్ర‌శ్నిస్తే.. 1934 నుంచి 1984 మ‌ధ్య‌లో రుద్ర‌మ‌దేవి జీవిత‌క‌థ‌ను ఎంచుకున్నాం. ఆ స‌మ‌యంలో త‌న జీవితంలో సంఘ‌ట‌న‌ల స‌మాహారంగా సినిమా చేయాల‌నుకున్నాం. స్క్రిప్టు కోసం చాలా రీసెర్చ్ చేశాం. రుద్ర‌మ‌కు 34వ ఏట ప‌ట్టాభిషేకం జ‌రిగింది మొద‌లు 84 ఏళ్ల వ‌య‌సు వ‌ర‌కూ కాక‌తీయ సామ్రాజ్యాన్ని పాలించారు. ఆ చరిత్ర మొత్తం చిత్రీక‌రించాల‌ని అనుకున్నాం. నా సొంత బ్యాన‌ర్ లోనే సినిమా తీయాల‌ని భావించాను. కానీ రాజ‌కీయ ప‌ర‌మైన ఒత్తిళ్ల వ‌ల్ల అది సాధ్య‌ప‌డ‌లేదు అని తెలిపారు. రాజ‌కీయాలు ఉద్య‌మాలు అంటూ బిజీగా టెన్ష‌న్స్ తో ఉండ‌డం వ‌ల్ల‌నే సినీ ఎంట్రీ కుద‌ర‌లేద‌ని కూడా విజ‌య‌శాంతి ఈ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.