Begin typing your search above and press return to search.

ఇన్ని గొప్పలు ఎందుకు రాములమ్మ?

By:  Tupaki Desk   |   14 Jan 2020 9:30 AM GMT
ఇన్ని గొప్పలు ఎందుకు రాములమ్మ?
X
వయసు మీద పడినంతనే చాదస్తం దానంతట అదే వస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తుంటుంది. పదమూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రాములమ్మ అలియాస్ విజయశాంతి నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ప్రొఫెసర్ భారతి క్యారెక్టర్ గురించి దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన హైప్ అంతా ఇంతా కాదు. సినిమాలో పవర్ ఫుల్ పాత్ర అంటూ ఆయన మాటలు.. సినిమా చూసిన వారికి ఏమీ అనిపించకపోవటం చూసినప్పుడు దర్శకుల వారు సరిగా కమ్యునికేట్ చేయలేదన్న మాట వినిపిస్తోంది.

అంతన్నారు.. ఇంతన్నారు.. తీరా చూస్తే.. ఇంతేనా? అన్నట్లుగా రాములమ్మ క్యారెక్టర్ సినిమాలో ఉందన్న టాక్ వినిపిస్తున్న వేళ.. రాములమ్మ తన గురించి చెప్పుకుంటున్న గొప్పలు ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంలో ఆమె మాటలు వింటే.. ఇప్పుడీ వేళ ఇన్ని గొప్పలు అవసరమా? అన్న క్వశ్చన్ రాక మానదు. అల వైకుంఠపురములో టబూ పాత్రకు.. ఆమెను తప్పించి మరెవరూ అంత నిండుదనాన్ని తీసుకురాలేరు. కానీ.. అలాంటి ఫీల్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో అనిపించదు.

ఇలాంటి చర్చ గడిచిన మూడు రోజులుగా వినిపిస్తున్నా.. విజయశాంతి మాత్రం తనను తాను ఎంతలా పొగిడేసుకుంటున్నారో తాజా వ్యాఖ్యల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. తాను ఇప్పటిదాకా 60 మంది హీరోలతో కలిసి పని చేశానని.. తనతో కలిపి 61 మంది అనుకోండన్న ఆమె.. తొంభై దశకంలోనే తాను అత్యధిక పారితోషికం తీసుకున్నట్లు చెప్పారు.

తాజా చిత్రంలోనూ హీరో తర్వాత అత్యధిక పారితోషికం తనదే ఎక్కువని చెప్పటం విశేషం. అంతేనా? తాను సినిమాల్లో సాధారణ పాత్రల్ని చేయనని.. వాటికో స్థాయి ఉండాలని పేర్కొన్నారు. నటిగా ఎలాంటి పాత్రలు పడితే అలాంటివి ఒప్పుకోనని..ప్రేక్షకుల్లో తనకున్న గౌరవాన్ని తగ్గించుకోనన్నారు. రోటీన్ అత్త పాత్రలు లాంటివి అస్సలు అంగీకరించనని..బలమైన.. శక్తివంతమైన పాత్రలు వస్తే ఏడాదికి ఒక్కటైనా చాలు ఒప్పుకుంటానని చెప్పుకొచ్చారు. తాను తాజాగా నటించిన ప్రొఫెసర్ భారతి పాత్ర.. ప్రతిఘటనలో సగం ప్రభావమున్న పాత్రగా అభివర్ణించిన ఆమె.. మరో సందర్భంలో మాత్రం గీత దాటేసే మాటల్ని చెప్పారు.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని ఒక సన్నివేశంలో భారతి పాత్రకు మహేశ్ బాబు సెల్యూట్ చేస్తాడని.. నటిగా నా స్థాయి ఉండటం వల్లే హీరో సెల్యూట్ చేస్తే ప్రేక్షకులకు నచ్చిందని.. వేరే వాళ్లు నటిస్తే వాళ్లు ఒప్పుకోరన్న విజయశాంతి మాటల్ని వింటే.. ఒకింత ఆశ్చర్యానికి గురి కాక మానదు. నిజమే.. రాములమ్మ గొప్పదే కావొచ్చు.. కానీ.. మరీ ఇంతలానా?