Begin typing your search above and press return to search.

జగన్‌ వచ్చినా వర్మకు తప్పని తిప్పలు

By:  Tupaki Desk   |   26 May 2019 8:22 AM GMT
జగన్‌ వచ్చినా వర్మకు తప్పని తిప్పలు
X
రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్రం విడుదలకు ఏపీలో అనేక సమస్యలు ఎదురైన విషయం తెల్సిందే. తెలంగాణలో ఎప్పుడో విడుదలైన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత అయినా విడుదల చేసేందుకు ప్రయత్నించగా అదీ సాధ్యం కాలేదు. ఎన్నికల కమీషన్‌ అందుకు అంగీకరించలేదు. ఏపీలో చంద్రబాబు నాయుడు పాలన పోయి జగన్‌ పాలకు రంగం సిద్దం అయ్యింది. ఈసమయంలో తన సినిమాను ఎలాంటి భయం లేకుండా విడుదల చేయవచ్చని వర్మ భావిస్తున్నాడు.

జగన్‌ సీఎంగా ఈనెల 30 ప్రమాణ స్వీకారం చేయబోతుండగా, తన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని ఇదే నెల 31న విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను వర్మ మొదలు పెట్టాడు. అందులో భాగంగానే వర్మ విజయవాడలోని పైపుల రోడ్డులో బహిరంగ మీడియా సమావేశం ఏర్పాటుకు సిద్దం అయ్యాడు. గతంలో ఇదే విధంగా ప్రయత్నించిన వర్మకు అప్పటి ప్రభుత్వం నుండి అనుమతులు రాలేదు. జగన్‌ సీఎం అయిన తర్వాత నన్ను ఆపేది ఎవరు ఉండరని భావించాడేమో కాని వర్మ మళ్లీ అక్కడే ప్రెస్‌ మీట్‌కు ప్రకటన చేశాడు.

ఈసారి కూడా వర్మ ప్రెస్‌ మీట్‌ కు పోలీసులు అడ్డు చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో పాటు.. ఆ ఏరియాలో కాలేజ్‌ లు మరియు స్కూల్స్‌ లో గ్రూప్‌ ఎగ్జామ్‌ జరుగుతుంది. దాంతో పాటు అక్కడ ప్రెస్‌ మీట్‌ పెట్టడం వల్ల శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎక్కడైనా ప్రెస్‌ క్లబ్‌ లో లేదంటే హాల్‌ లో ప్రెస్‌ మీట్‌ ను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా వర్మకు విజయవాడ నార్త్‌ ఏసీపీ రమేష్‌ బాబు నోటీసులు పంపించారు. ఈ నోటీసులపై వర్మ ఎలా స్పందిస్తాడనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.