Begin typing your search above and press return to search.

పూరీ జగన్నాథ్‌ అంటే నాకు అసూయ: రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

By:  Tupaki Desk   |   27 May 2021 4:09 PM GMT
పూరీ జగన్నాథ్‌ అంటే నాకు అసూయ: రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్
X
ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'బాహుబలి' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్.. తనయుడి ప్రతీ విజయంలో ఉన్నాడు. కేవలం తెలుగులో కాకుండా తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా మంచి కథలను అందిస్తూ పాన్ ఇండియా రైటర్ గా మారిపోయారు విజయేంద్ర ప్రసాద్. 'శ్రీకృష్ణ 2006' 'రాజన్న' 'శ్రీవల్లి' వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన.. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్‌ వాంటెడ్‌ రైటర్‌ గా కొనసాగుతున్నారు. అయితే కమెడియన్ ఆలీ హోస్ట్ చేస్తున్న ఓ కార్యక్రమానికి హాజరై పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది.

ఈ సందర్భంగా 'తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి కాకుండా మీకు నచ్చిన డైరక్టర్‌ ఎవరు?' అని అలీ ప్రశ్నించారు. దీనికి విజయేంద్రప్రసాద్‌ సమాధానం చెబుతూ.. ''పూరి జగన్నాథ్‌. ఆయన అంటే నాకు అసూయ. నా శత్రువును ప్రతిరోజూ చూడాలని ఆయన ఫొటో నా ఫోన్‌ లో వాల్‌ పేపర్‌ గా పెట్టుకున్నాను'' అని నవ్వుతూ అన్నారు. 'భజరంగీ భాయిజాన్‌' సినిమాను 'పసివాడి ప్రాణం'తో పోల్చి చూడటం పై మాట్లాడుతూ.. ''పసివాడి ప్రాణం నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ సినిమా చూసేటప్పుడు 'భలే బాగుందే.. సినిమా నొక్కేద్దామా' అని నా స్నేహితులతో అన్నాను'' అని సీనియర్ రచయిత చెప్పుకొచ్చారు. రైటర్‌ గా సక్సెస్‌ అయ్యాను. కానీ.. డైరక్టర్‌ గా సక్సెస్‌ కాలేకపోయానని ఆయన అన్నారు.

''ఒక వ్యక్తి 'రాజన్న' సినిమా చూసి తెలుగులో ముందు వరుసలో ఉన్న డైరక్టర్లతో సమానంగా తీశారు అన్నాడు. మళ్లీ అదే వ్యక్తి 'శ్రీవల్లీ' సినిమా చూసి 'మీకు డైరక్షన్‌ రాదు' అని చెప్పాడు. అతను మా అబ్బాయి రాజమౌళి'' అని నవ్వుతూ చెప్పారు విజయేంద్ర ప్రసాద్‌. తన కథలలో హీరోకు ఫ్లాష్ బ్యాక్ ఉంటడం అనేది సౌలభ్యంగా చేసుకోవడం తప్పితే, అలానే ఉండాలని నిబంధన ఏం లేదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సినిమాలు చూస్తే తనకు నిద్ర వస్తుందని.. కొన్నిసార్లు నిద్రపోవడానికే సినిమాకు వెళ్లేవాడినని విజయేంద్ర నవ్వుతూ చెప్పారు. ఇండస్ట్రీలో బాగా నచ్చిన విషయం ఏంటని అలీ అడుగగా.. ''అబద్ధాలు ఆడేవారికి మంచి చోటు ఉంటుంది. అది బాగా నచ్చింది. ఇండస్ట్రీకి రావాలనుకునేవాళ్లు కూడా అబద్ధాలాడటం నేర్చుకోవాలి'' అని ఐఆయన సమాధానం చెప్పారు.

ఈ క్రమంలో 'విజయేంద్రప్రసాద్‌ గారి అబ్బాయి రాజమౌళి. రాజమౌళి గారి తండ్రి విజయేంద్రప్రసాద్‌. ఈ రెండింట్లో మీకు ఏది బాగా అనిపించింది?' అని అలీ ప్రశ్నించారు. దీనికి ఆయన మాట్లాడుతూ ''మొదటి దాంట్లో నాకు ఎక్కువ పేరుంటే 'నా కొడుకు నాకన్నా ఎప్పుడు గొప్పవాడవుతాడ'నే కోరిక ఉండేది. రెండో దాంట్లో 'నా కొడుకు అంతటి స్థాయికి నేనెప్పుడు ఎదుగుతా'నని బాధ ఉంటుంది'' అని అన్నారు. 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' సినిమా చాలా బాగుందని.. అందులో అలియా భట్‌ సర్ప్రైజ్ ప్యాకేజ్‌ అని.. ఆమె తెరపై కనిపించే సమయం తక్కువే అయినా ప్రతి సీన్‌ లోనూ ఆమే కనిపిస్తుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.