Begin typing your search above and press return to search.

విజయేంద్ర ప్రసాద్.. ఒక నిజం-ఒక అబద్ధం

By:  Tupaki Desk   |   20 Sep 2017 5:47 PM GMT
విజయేంద్ర ప్రసాద్.. ఒక నిజం-ఒక అబద్ధం
X
రచయితగా విజయేంద్ర ప్రసాద్ ఎంత గొప్ప పేరు సంపాదించాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి.. భజరంగి భాయిజాన్ లాంటి సినిమాలతో ఆయన పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. ఐతే రచయితగా ఏ స్థాయికి ఎదిగినా దర్శకుడిగానూ నిరూపించుకోవాలని ఆయనకు ఎప్పట్నుంచో కోరిక ఉంది. ఇందుకోసం శ్రీకృష్ణ 2006.. రాజన్న లాంటి సినిమాలతో ప్రయత్నించిన విజయేంద్ర.. ఈ మధ్యే ‘శ్రీవల్లి’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కానీ ఈ సినిమా విడుదలైన సంగతే జనాలకు తెలియదు. ఈ సినిమా చూసిన వాళ్లు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. విజయేంద్ర నుంచి ఇలాంటి సినిమా ఆశించలేదన్నారు.

ఐతే టాక్ తో సంబంధం లేకుండా ప్రతి సినిమాకూ పెట్టినట్లే ‘శ్రీవల్లీ’కి కూడా చిత్ర బృందం సక్సెస్ మీట్ పెట్టేసింది. తమ సినిమా అద్భుత విజయం సాధించిందంటూ ఊదరగొట్టేసింది. విజయేంద్ర ప్రసాద్ సైతం తన సినిమా సూపర్ సక్సెస్ అనేశారు. తన పిచ్చిని తట్టుకుని కొత్త వాళ్లతో ఇలాంటి సినిమా తీయడం.. దాన్ని అన్ని ఏరియాల్లోనూ అమ్మడం నిర్మాతల గొప్పదనమని.. గత వారం వచ్చిన సినిమాలన్నింట్లోకి తమదే బెస్ట్ మూవీ అని ప్రేక్షకులు అంటున్నారని.. బయ్యర్లు చాలా సంతోషంగా ఉన్నారని.. మంచి వసూళ్లు వస్తున్నాయని చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్. ఐతే ఈ మాటల్లో వాస్తవమెంతన్నది జనాలకు తెలియంది కాదు. కానీ ఇవన్నీ చెబుతూనే.. సినిమాలో అందరూ బాగా చేశారని.. దర్శకుడిగా తాను మాత్రమే సరైన ఔట్ పుట్ ఇవ్వలేదని.. మంచి కథ రాసినా దాన్ని అనుకున్న విధంగా తెరకెక్కించలేకపోయానని చెబుతూ ఓ వాస్తవాన్ని అంగీకరించారు విజయేంద్ర.