Begin typing your search above and press return to search.

అచ్చం సంఘ్ గొంతుతోనే : గాంధీ మీద విజయేంద్ర ప్రసాద్ హాట్ కామెంట్స్ ...?

By:  Tupaki Desk   |   9 July 2022 10:03 AM GMT
అచ్చం సంఘ్ గొంతుతోనే : గాంధీ మీద విజయేంద్ర ప్రసాద్ హాట్ కామెంట్స్ ...?
X
మహాత్ములు పుట్టారు, ఈ దేశానికి సేవ చేశారు, వెళ్ళిపోయారు. తరాలు మారాయి, దేశం ముందుకు సాగుతోంది. అయితే చరిత్ర లోతుల్లోకి వెళ్తే కొందరు కొన్ని సందర్భాలలో చేసిన నిర్ణయాలు అయితే ఈ రోజున చూస్తే వేరేగా అనిపిస్తాయి. దీనికి ఎవరి ఆలోచనలు వారివిగా ఉంటాయి కాబట్టి వారి దృక్కోణం నుంచి చూసినపుడు కొన్ని ఒప్పు అనిపిస్తాయి, మరికొన్ని తప్పు అనిపిస్తాయి. అంతమాత్రం చేత జాతినేతలను ఈ తరం దృష్టిలో చిన్న చేయాలనుకోవడం ఒక విధంగా మంచి పరిణామమేనా అనిపిస్తుంది.

ఇదంతా ఎందుకంటే తాజాగా బీజేపీ వారి చేత రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయిన సినీ కధా రచయిత విజయేంద్రప్రసాద్ జాతిపిత మహాత్మా గాంధీ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు వల్లనే. ట్రిపుల్ ఆర్ మూవీ విడుదల సందర్భంగా ఆయన ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో గాంధీ నాడు అనుసరించిన వైఖరిని తప్పుపట్టారు. ట్రిపుల్ ఆర్ లో చివరన వచ్చే పాటలో దేశంలోని స్వాతంత్ర వీరుల జాబితాలో గాంధీ నెహ్రూల చిత్ర పటాలను ఎందుకు చూపించలేదు అన్న ప్రశ్నకు ఆ ఇంటర్వ్యూలో ఆయన చాలా సుదీర్ఘమైన జవాబు చెప్పారు.

ఆ జవాబు అయితే కచ్చితంగా గాంధీని అభిమానించేవారిని మండించేదే. ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ ఏమన్నారు అంటే గాంధీ దేశానికి తొలి ప్రధానిగా నెహ్రూని ఎన్నుకోవడం కోసం పటేల్ ని తీసి పక్కన పెట్టారని, నాడు బ్రిటిష్ వారు దేశం విడిచిపోతూ దేశానికి ప్రధాని అభ్యర్ధిని ఎంపిక చేయమని గాంధీకి సూచించారని చెప్పారు. నాడు కాంగ్రెస్ కి 17 పీసీసీలు ఉంటే అందులో నుంచి అభిప్రాయ సేకరణను గాంధీ జరిపితే మొత్తం 15 మంది ఏకమొత్తగ్నా పటేల్ అభ్యర్ధిత్వాన్ని ప్రధాని పదవికి ఎంపిక చేశారు. ఒకరు ఏమీ రాయకుండా ఇచ్చేస్తే మరో ఓటు ఆచార్య కృపాలనీకి వచ్చింది. నెహ్రూని మాత్రం ఎవరూ ప్రతిపాదించలేదు.

దాంతో గాంధీ 18వ పీసీసీగా ఢిల్లీని క్రియేట్ చేసి మరీ నెహ్రూ పేరును అలా ప్రతిపాదించి ఆయనకు తొలి ప్రధాని అయ్యే అవకాశం కల్పించారు అని విజయేంద్రప్రసాద్ చెబుతున్నారు. ప్రజాస్వామ్యం మీద గాంధీకి విశ్వాసం ఉంటే ఇలా చేసే వారా అని కూడా విజయేంద్రప్రసాద్ ప్రశ్నించడం విశేషం. ఇది చరిత్రలో కనబడని సత్యమైతే ఆయన లోతుల్లోకి వెళ్ళి దీన్ని శోధించి బయటపెట్టినట్లుగా ఉంది.

ఇక పటేల్ తొలి ప్రధానిగా ఉంటే కాశ్మీర్ రావణకాష్టంగా ఈ రోజుకీ రగిలే అవకాశం ఉండేది కాదు అన్నది విజేయంద్ర ప్రసాద్ భావన. అంతే కాదు ఒక్క మాటతో నాడు 561 సంస్థానాలను దేశంలో విలీనం చేశి భారత్ ని బలమైన దేశంగా పటేల్ మార్చారని కూడా విజయేంద్రప్రసాద్ గుర్తు చేశారు.

మొత్తానికి ఇది పాత ఇంటర్యూ అయినా కూడా ఇపుడు విజయేంద్రప్రసాద్ బీజేపీ తరఫున రాజ్యసభ ఎంపీ కావడంతో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతే కాదు దీని మీద అనుకూల వ్యతిరేక భావనలు కూడా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా విజయేంద్రప్రసాద్ గాంధీని వ్యతిరేకించడం ద్వారా తనది అచ్చమైన ఆరెస్సెస్ గొంతు అని రుజువు చేసుకున్నారు అని కూడా నెటిజన్లు కొందరు కామెంట్స్ చేయడం విశేషం.