Begin typing your search above and press return to search.

దేవుడికి పూజ చేసినట్లు షోలే చూస్తాడట

By:  Tupaki Desk   |   11 Aug 2015 1:45 PM GMT
దేవుడికి పూజ చేసినట్లు షోలే చూస్తాడట
X
విజయేంద్ర ప్రసాద్ తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి రెండున్నర దశాబ్దాలవుతోంది. కానీ ఇప్పుడే ఆయనకు రావాల్సినంత పేరు వచ్చింది. కథకుడిగా వారం వ్యవధిలో బాహుబలి, భజరంగి భాయిజాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడంతో ఆయన పేరు మార్మోగిపోతోంది. బాలీవుడ్ వాళ్లు కూడా ఆయనతో ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్నారు. ఆయన కూడా ఏం మొహమాట పడకుండా బాగానే ఇంటర్వ్యూలిస్తున్నారు. అలాంటి ఓ ఇంటర్వ్యూ లో బాలీవుడ్ సినిమాల ప్రస్తావన వచ్చింది. మీకు నచ్చిన సినిమా ఏది అంటే.. షోలే అని బదులిస్తూ తన జీవితంపై ఆ సినిమా ఎంత ప్రభావం చూపించిందో వివరించారు విజయేంద్ర ప్రసాద్.

‘‘షోలే సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. చూసిన ప్రతిసారీ నాకు కొత్త అర్థాలు కనిపించేవి. ఏదైనా పని మొదలుపెట్టాలంటే దేవుడి ప్రార్థన చేసినట్లే నేను షోలే సినిమా చూశాక పని చేస్తాను. ఆ సినిమా చూస్తే నా మనసు ఛార్జ్ అయిపోతుంది. కొత్త ఐడియాలు వస్తాయి’’ అని చెప్పారు విజయేంద్ర ప్రసాద్. తనకు అంతగా స్ఫూర్తినిచ్చిన ‘షోలే’ సినిమా కథ రాసిన సలీమ్ ఖాన్.. ‘భజరంగి భాయిజాన్’ విషయంలో అందించిన ప్రశంసలు ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. ‘‘కథ చెప్పినపుడే సలీమ్ ఖాన్ ఫిదా అయిపోయారు. తాను ఎన్నో కథలు రాశానని.. కానీ ఇంత గొప్ప కథ మాత్రం ఎప్పుడూ రాయలేదని చెప్పారు. ఆయన మాటలు అల్టిమేట్. అంతే కాదు. కథ విన్నాక ప్రసాద్.. మా అబ్బాయి సల్మాన్ ఈ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో.. వాడి కంటే నువ్వు ఒక రూపాయి ఎక్కువ పుచ్చుకో’ అన్నారు. అంతకంటే మంచి కాంప్లిమెంట్ మరొకటి ఉండదు’’ అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.