Begin typing your search above and press return to search.

కిలో బియ్యానికి కష్టపడ్డాం-విజయేంద్ర ప్రసాద్

By:  Tupaki Desk   |   25 July 2015 1:38 PM GMT
కిలో బియ్యానికి కష్టపడ్డాం-విజయేంద్ర ప్రసాద్
X
విజయేంద్ర ప్రసాద్ ను ఇప్పుడు వెయ్యి కోట్ల రచయిత అని చెప్పొచ్చు. బాహుబలి, భజరంగి భాయిజాన్ సినిమాలకు ఆయనే కథకుడు. ఈ రెండు సినిమాలు కలిపి ఫుల్ రన్ లో చెరో ఐదొందల కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బహుశా మన దేశంలో కేవలం రెండు సినిమాలతో రచయితగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన ఘనత ఒక్క విజయేంద్ర ప్రసాద్ కు మాత్రమే దక్కిందని చెప్పొచ్చు. రాజమౌళి ఓ ప్రాంతీయ చిత్రంతో రూ.500 కోట్ల సాధించబోతున్న దర్శకుడిగా రాజమౌళి కూడా చరిత్రలో నిలవబోతున్నాడు. ఐతే ఇప్పుడిలా కనకాభిషేకంలో తడుస్తున్న ఈ ఫ్యామిలీ ఒకప్పుడు.. తిండికి కష్టపడ్డ రోజులున్నాయి. ఆ సంగతుల్ని ఓ ఇంటర్వ్యూ లో ఉద్వేగంగా చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్.

‘‘నేను సినీ రంగంలోకి రావడం యాదృచ్ఛికంగా జరిగింది. మా కుటుంబమంతా ఇప్పుడు సినిమాల్లో ఉందంటే అందుకు మా అన్నయ్య, కీరవాణి తండ్రి శివశక్తి దత్తానే కారణం. ఆయన బహుముఖ ప్రజ్నాశాలి. ఆయన చెన్నై వస్తూ నన్నూ ఆయన వెంట తీసుకొచ్చారు. మేమొకప్పుడు బాగా బతికినవాళ్లం. ఆస్తులు బాగానే ఉండేవి. కానీ మా అన్నయ్య తీసిన ఓ సినిమాతో మొత్తం ఆస్తంగా హారతి కర్పూరం అయిపోయింది. మాది ఉమ్మడి కుటుంబం. చాలా పెద్దది. అందరికీ తిండి పెట్టడానికి ఏ రోజుకారోజు కిలో బియ్యం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా నెలలు కాదు. కొన్నేళ్లు కష్టపడ్డాం. ఆ తర్వాత కీరవాణికి రాఘవేంద్రరావుగారు పరిచయమవ్వడం.. అతను మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశాలు సంపాదించడంతో మా కష్టాలు తీరాయి. అతనే కొన్నేళ్ల పాటు అంత పెద్ద కుటుంబాన్ని పోషించాడు. అందరికీ అతనే తిండిపెట్టాడు. తోబుట్టువుల పెళ్లిళ్లు చేశాడు. కథా రచయితగా నాకూ అవకాశాలు రావడంతో పరిస్థితి మెరుగైంది. రాఘవేంద్రరావుగారిని కలిస్తే మూగమనసులు తరహాలో కథ రాయమన్నారు. కానీ అలా ఉండకూడదన్నారు. ఆలోచించి జానకి రాముడు కథ అందించా. మామూలుగా నా స్థాయికి ఊరికే డబ్బులిచ్చేసి పంపించేస్తారనుకున్నా. కానీ ఆయన టైటిల్స్ లో కథకు క్రెడిట్ ఇస్తూ నా పేరు కూడా వేశారు. రచయితగా అవకాశాలు బాగా ఉన్న సమయంలో మళ్లీ నిర్మాతగా, దర్శకుడిగా అర్థాంగి సినిమా తీసి చాలా డబ్బులు పోగొట్టుకున్నా. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి మళ్లీ కొంచెం టైం పట్టింది’’ అని విజయేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు.