Begin typing your search above and press return to search.

ఎవరూ చేయని సాహసం చేసిన జక్కన్న తండ్రి

By:  Tupaki Desk   |   10 Aug 2021 10:31 AM GMT
ఎవరూ చేయని సాహసం చేసిన జక్కన్న తండ్రి
X
ఎవరినైనా సరే.. ఇట్టే కెలికేయటం..స్వేచ్ఛ పేరుతో.. నా ఇష్టం అంటూ ఇష్టారాజ్యంగా కెలికేయటంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా. అలాంటి ఆయన కంట్లో కానీ నోట్లో కానీ నానకూడదని దేవుడికి దండం పెట్టుకునే వారు ఇండస్ట్రీలో బోలెడంతమంది ఉంటారు. ఎప్పుడు ఎలాంటి మూడ్ లో ఉంటారో.. ఏం గుర్తుకు వచ్చి.. సోషల్ మీడియాలో ఏమేం రాసేస్తారో తెలీక బిక్కుబిక్కుమంటూ ఉండే వారికి కొదవ ఉండదు.

అలాంటి వర్మను.. నేరుగా.. అదీ సభాముఖంగా.. ఆయన్ను ఎదుట పెట్టేసి కెలకటం అనే సాహసం ఎవరైనా చేస్తారా? అంటే నో అంటే నో అనేస్తారు. కానీ.. ప్రతి ఒక్కరికి మరొకరు ఉంటారన్న సూత్రానికి తగ్గట్లే.. అలాంటి పనే చేసి వార్తల్లోకి వచ్చారు బాహుబలి రచయిత.. జక్కన్న ఫాదర్ విజయేంద్రప్రసాద్. ఆయన చేసిన సాహసం గురించి తెలిసిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అందరిని కెలికే వర్మనే కెలికేశాడు పెద్దాయన అంటూ కామెంట్లు చేసేస్తున్నారు.

ఇంతకీ వర్మను ఎప్పుడు.. ఎక్కడ.. ఏమని అన్నారు? దానికి వర్మ రియాక్షన్ ఏమిటన్న విషయంలోకి వెళితే.. సునీల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైం థ్రిల్లర్ చిత్రం ‘‘కనబడుటలేదు’’. ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. దీనికి విజయేంద్రప్రసాద్.. రాంగోపాల్ వర్మలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తన వంతుగా మాట్లాడటానికి వచ్చిన వేళ.. విజయేంద్రప్రసాద్ వర్మ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ఒక మనిషి నాకు కనబడుటలేదు. సినిమా తీస్తానంటూ 1989లోఒక యువ కెరటం వచ్చింది. ఎక్కడ పని చేసిన అనుభవం లేదు. సినిమా తీసిన అనుభవం కూడా లేదు. కేవలం ప్యాషన్ తో సినిమా తీశాడు. కాలేజీ కుర్రాళ్లతో సైకిల్ చైన్ పట్టించాడు. ఆ మనిషి నాకు కనబడటం లేదు. ఆ తర్వాత శ్రీదేవి అందాల్ని ఎవరూ చూపనంత గొప్పగా చూపించాడు. అంతేకాదు సత్య.. రంగీల లాంటి అద్భుతమైన సినిమాలు తీసి వందలమంది డైరెక్టర్లను.. ఆర్టిస్టులను.. టెక్నీషియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి నాకు కనబడుట లేదు. మళ్లీ అతన్ని చూడాలని ఉంది’ అంటూ ప్రేమగా కెలికేశాడు.

ప్రపంచంలో పొగడ్తకు మించిన మందు లేదంటారు. అందేనా.. సద్విమర్శతో కూడి పొగడ్త.. అందులోనే పెద్దరికంతో కూడిన మదలింపు.. అభిమానంతో కూడిన ఆవేదన.. అంతకు మించిన అక్రోశం ఉండటంతో.. పెద్దమనిషి అంతలా అన్నాక కూడా వర్మ ఏమీ అనలేదు సరికదా.. ఆయన మాట్లాడుతున్నంత సేపు స్టేజ్ కింద కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వుకోవటం కనిపించింది. ఏమైనా.. బాహుబలినే సృష్టించినోడికి.. వర్మను డీల్ చేయటం రాకుండా ఉంటుందా ఏంటి?