Begin typing your search above and press return to search.

'సింహాద్రి' కథ బాలకృష్ణగారికి నచ్చలేదు: విజయేంద్ర ప్రసాద్

By:  Tupaki Desk   |   1 Jun 2021 8:30 AM GMT
సింహాద్రి కథ బాలకృష్ణగారికి నచ్చలేదు: విజయేంద్ర ప్రసాద్
X
ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'సింహాద్రి' ఒకటిగా కనిపిస్తుంది. 'స్టూడెంట్ నెంబర్ 1' హిట్ తరువాత రాజమౌళి .. ఎన్టీఆర్ కలిసి చేసిన సినిమా ఇది. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ .. సంగీతం ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయి. అలాంటి ఈ సినిమాకి కథను అందించినది విజయేంద్ర ప్రసాద్. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా గురించిన విశేషాలను పంచుకున్నారు.

దర్శకుడు బి.గోపాల్ గారు 'సింహాద్రి' కథను బాలకృష్ణగారికి చెప్పారు. ఎందుకోగాని ఆయనకి ఆ కథ నచ్చలేదు. అదే సమయంలో నిర్మాత దొరస్వామిరాజుగారు .. ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. 'కథ ఏదైనా ఉందా?' అని నన్ను అడిగితే, రాజమౌళి దర్శకత్వంలో చేసేట్టు అయితే ఇస్తానని చెప్పాను. అప్పటికే రాజమౌళి - ఎన్టీఆర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ప్రాజెక్టు విషయంలో ఇక సమస్య ఉండదని అలా చెప్పాను. 'సింహాద్రి' కథ వినగానే దొరస్వామిరాజుగారు నచ్చేసిందన్నారు.

'సింహాద్రి' సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అప్పట్లో నేను చెన్నైలో ఉండేవాడిని. గణేశ్ అనే అసోసియేట్ తో కలిసి నేను 'మూండ్రమ్ పిరై' (వసంత కోకిల) సినిమాను చూశాను. క్లైమాక్స్ చూసిన తరువాత .. "శ్రీదేవి అలా చేస్తే కమల్ హాసన్ కి గుండెల్లో గుచ్చినట్టుగా ఉంటుంది కదా? .. అది ఇంటర్వెల్ చేసి ఒక కథను రెడీ చేద్దామా?" అని అన్నాను. "నిజంగానే హీరోయిన్ హీరోను గునపం పెట్టి గుండెల్లో గుచ్చాలి .. అదే ఇంటర్వెల్ బ్యాంగ్ కావాలి" అని అన్నాడు. ఆ మాట నుంచి ఆయన ఇక దిగలేదు. దాంతో గుణపంతో హీరోయిన్ హీరో గుండెల్లో గుచ్చడానికి ఒక కారణం ఉండాలి కదా అనే ఉద్దేశంతో, ఆ సంఘటనకి ముందు వెనుక కథను అల్లుకోవడం జరిగింది" అని చెప్పుకొచ్చారు.