Begin typing your search above and press return to search.

ఆ సినిమా రిలీజవుతుందా లేదా?

By:  Tupaki Desk   |   8 May 2017 10:56 AM GMT
ఆ సినిమా రిలీజవుతుందా లేదా?
X
విజయేంద్ర ప్రసాద్.. ప్రస్తుతం దేశమంతా చర్చనీయాంశమవుతున్న పేరు. ‘బాహుబలి’ సినిమాతో ఆయన కీర్తి ప్రఖ్యాతులు ప్రపంచ స్థాయికి చేరాయి. ‘బాహుబలి’ మొదలయ్యాక దీని మీద పని చేస్తూనే.. మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులకు స్క్రిప్టు రాశారు విజయేంద్ర. ‘భజరంగి భాయిజాన్’.. ‘జాగ్వార్’లతో పాటు విజయ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమాకు స్క్రిప్టు అందించింది కూడా విజయేంద్ర ప్రసాదే. ఐతే రచయితగా ఇంత బిజీగా ఉంటూనే మెగా ఫోన్ పట్టి ఓ సినిమా తీశారు విజయేంద్ర ప్రసాద్. అదే.. వల్లీ. కన్నడ.. తెలుగు భాషల్లో తెరకెక్కిన సినిమా ఇది. ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్ తో విజయేంద్ర ఈ సినిమా రూపొందించాడు.

ఐతే గత ఏడాది పూర్తయిన ఈ సినిమా విడుదలకు నోచుకోవడం లేదు. అటు కన్నడలో కానీ.. ఇటు తెలుగులో కానీ ఈ సినిమాకు బిజినెస్ కావడం లేదని సమాచారం. అందరూ కొత్తవాళ్లే నటించడం.. ట్రైలర్ అదీ చూస్తే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉండటంతో ‘వల్లీ’ జనాల్లో అంతగా క్యూరియాసిటీ పెంచలేకపోయింది. ఈ సినిమా మీద నిర్మాతలు కొంచెం ఎక్కువ పెట్టుబడే పెట్టారు. అది రికవర్ అయ్యేలా బిజినెస్ జరగట్లేదని సమాచారం. ఆ మధ్య ఆడియో వేడుక చేసినపుడు కొంచెం ఈ సినిమా గురించి చర్చ జరిగింది కానీ.. తర్వాత వార్తల్లోనే లేకుండా పోయింది. ఓవైపు రచయితగా ‘బాహుబలి-2’ లాంటి ఘనవిజయాలు చూస్తూ.. తన దర్శకత్వంలో తీసిన సినిమా విడుదలకే నోచుకోకుండా ఉండిపోతే అది విజయేంద్ర ప్రసాద్ కు ఇబ్బంది కలిగించే విషయమే. ఎలాగోలా ఈ సినిమాను సాధ్యమైనంత వేగంగా బయటికి తేలేకపోతే.. ఇక ఎప్పటికీ విడుదలకే నోచుకోకుండా ఆగిపోతుంది.