Begin typing your search above and press return to search.

రాజమౌళి ఫాదర్.. ఇలా ఎలా సాధ్యం

By:  Tupaki Desk   |   6 May 2017 9:50 AM GMT
రాజమౌళి ఫాదర్.. ఇలా ఎలా సాధ్యం
X
విజయేంద్ర ప్రసాద్.. ఇప్పుడు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరిది. రచయితగా టాలీవుడ్లో ఆయనది 30 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. 90ల్లోనే బొబ్బిలిసింహం.. సమరసింహారెడ్డి లాంటి సూపర్ హిట్ సినిమాలకు కథ అందించారాయన. ఐతే ఆ సినిమాలతో వచ్చిన పేరు కంటే కూడా కొడుకు రాజమౌళితో చేసిన సినిమాలకే ఆయనకు ఎక్కువ పేరొచ్చింది. ఐతే కొడుకు ప్రతిభతో నెట్టుకొచ్చేస్తున్నాడంటూ ఆయన రచనా పఠిమను సందేహించిన వాళ్లూ లేకపోలేదు. అలాంటి వాళ్లకు సమాధానమే ‘భజరంగి భాయిజాన్’. ఈ సినిమా కథను సల్మాన్ ఖాన్-కబీర్ ఖాన్ కళ్లకద్దుకుని తీసుకున్నాడు. అది ఏ స్థాయి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు క్రిష్ ఝాన్సీ లక్ష్మీభాయి జీవితం నేపథ్యంలో తీయబోతున్న ‘మణికర్ణిక’కు కూడా కథ-స్క్రీన్ ప్లే అందిస్తున్నది ఆయనే.

విజయేంద్ర ప్రసాద్ వయసు ప్రస్తుతం 73 ఏళ్లు కావడం విశేషం. ఇటు టాలీవుడ్లో.. అటు బాలీవుడ్లో.. మరోవైపు కోలీవుడ్లో.. ఎందరో లెజెండరీ రైటర్లను చూశాం. కానీ వాళ్లందరూ ఒక టైంలో ఒక వెలుగు వెలిగి వయసు మళ్లాక జోరు తగ్గించేసిన వాళ్లే. హిందీలో సలీం-జావెద్.. తెలుగులో సత్యమూర్తి.. సత్యానంద్.. మహారథి.. పరుచూరి బ్రదర్స్.. ఇలా చాలామంది రచయితల్ని ఇందుకు ఉదాహరణగా చూపించవచ్చు. కానీ విజయేంద్ర ప్రసాద్ మాత్రం లేటు వయసులోనే పీక్స్ అందుకన్నారు. 60 ఏళ్ల తర్వాత విరామం లేకుండా పని చేస్తున్నారు. అందులోనూ 70 ఏళ్ల తర్వాత మరీ బిజీ అయ్యారు. ‘బాహుబలి’ సినిమాను నాలుగైదేళ్లు తీసినప్పటికీ.. ఆయన ఈ సమయంలో ఈ ఒక్క సినిమాకే పరిమితం కాలేదు. ‘భజరంగి భాయిజాన్’ కథ ఇచ్చారు. ‘జాగ్వార్’కు స్క్రిప్టు రాశారు. విజయ్ కొత్త సినిమాకు కూడా స్క్రీన్ ప్లే సమకూర్చారు. తన స్వీయ దర్శకత్వంలో ‘వల్లి’ అనే సినిమా కూడా చేశారు. ‘మణికర్ణిక’కూ స్క్రిప్టు అందించారు. మరోవైపు రాజమౌళి కొత్త సినిమాకూ కథ అందించే ప్రయత్నంలో పడుతున్నారు. ఈ వయసులో ఇలాంటి భారీ ప్రాజెక్టులకు పని చేస్తూ.. తన నైపుణ్యాన్ని చాటుకుంటూ.. ఇంతలా కష్టపడటం విజయేంద్ర ప్రసాద్ కే చెల్లింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/