Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘విజేత’

By:  Tupaki Desk   |   12 July 2018 9:23 AM GMT
మూవీ రివ్యూ: ‘విజేత’
X
చిత్రం : ‘విజేత’

నటీనటులు: కళ్యాణ్ దేవ్ - మాళవిక నాయర్ - మురళీ శర్మ - నాజర్ - కళ్యాణి నటరాజన్ - ప్రగతి - సుదర్శన్ - కిరీటి - నోయల్ - జయప్రకాష్ - రాజీవ్ కనకాల - ఆదర్శ్ బాలకృష్ణ - భద్రమ్ - మహేష్ తదితరులు
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
ఛాయాగ్రహణం: కె.కె.సెంథిల్ కుమార్
నిర్మాత: రజని కొర్రపాటి
రచన - దర్శకత్వం: రాకేశ్ శశి

టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడొచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ తెరంగేట్రం చేసిన ‘విజేత’ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి నిర్మాణంలో కొత్త దర్శకుడు రాకేశ్ శశి రూపొందించిన చిత్రమిది. మరి ఈ సినిమా ఎలా ఉందో.. అరంగేట్ర సినిమాలో కళ్యాణ్ దేవ్ ఎలా చేశాడో చూద్దాం పదండి.

కథ:

రామ్ (కళ్యాణ్ దేవ్) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు. అతడి తండ్రి శ్రీనివాసరావు (మురళీ శర్మ) చిన్నప్పట్నుంచి కొడుకు కోరిందల్లా ఇస్తూ అతడిని పెంచి పెద్ద చేస్తాడు. ఐతే తండ్రి కష్టాన్ని అర్థం చేసుకోకుండా.. బాధ్యత తెలుసుకోకుండా ప్రవర్తిస్తుంటాడు రామ్. చదువు పూర్తి చేశాక ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడికి ఉద్యోగం రాదు. ఇక లాభం లేదని ఒక చిన్న వ్యాపారం మొదలుపెడితే అది బెడిసి కొడుతుంది. కొడుకు ఎన్ని తప్పులు చేసినా భరిస్తూ వచ్చిన తండ్రి.. చివరికి అతడు చేసిన పనికి తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఆయన మనసు విరిగిపోతుంది. అనారోగ్యం బారిన పడతాడు. ఈ స్థితిలో కళ్యాణ్ తండ్రి మనసు గెలవడానికి ఏం చేశాడు.. జీవితంలో తనెలా గెలిచాడు.. తండ్రినెలా గెలిపించాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ఒక పెద్ద సినీ కుటుంబం నుంచి కొత్త హీరో అరంగేట్రం అనగానే.. డ్యాన్సులు.. ఫైట్లలో అతడి నైపుణ్యాల్ని ప్రదర్శించడానికి వేదికగా మారుతుంటుంది తొలి సినిమా. అలాగే ఆ హీరో రకరకాల ఎమోషన్లు చూపించడానికి తగ్గట్లు కథతో సంబంధం లేని ఎపిసోడ్లను పేర్చే ప్రయత్నం చేస్తారు. అలాగే అనేక కమర్షియల్ హంగులద్దడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. ఐతే మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ అరంగేట్ర చిత్రం ‘విజేత’లో ఇలాంటివేమీ కనిపించవు. కళ్యాణ్ ను హీరోలా కాకుండా కథలో ఒక పాత్రధారిగా మాత్రమే చూపించడం.. ఆ పాత్ర కథతో పాటు సాగిపోవడం అభినందించదగ్గ విషయాలు. ఈ విషయంలో రొటీన్ కు భిన్నంగా ఆలోచించిన దర్శకుడు రాకేశ్ శశి.. కథాకథనాల విషయంలో కూడా కొత్తగా ట్రై చేసి ఉంటే బాగుండేది. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఎన్నోసార్లు చూసిన ఒక మామూలు కథనే అతనూ చూపించాడు.

సినిమా కుదురుగా సాగిపోయినా.. భావోద్వేగాలు బాగానే పండినా.. సాంకేతిక హంగులు.. నిర్మాణ విలువలు చక్కగా కుదిరినా.. ప్రెడిక్టబిలిటీ ఫ్యాక్టర్ ‘విజేత’కు పెద్ద మైనస్. కథలో కొత్తదనం లేకపోగా.. నెమ్మదిగా సాగే కథనం కూడా ‘విజేత’కు ప్రతికూలంగా మారింది.

మెగాస్టార్ అల్లుడి కోసం రాకేశ్ శశి ఒక సేఫ్ గేమ్ ఆడాడు. కుటుంబం కోసం తన కలల్ని త్యాగం చేసి.. తన సర్వశ్వం దారబోసే తండ్రి.. బాధ్యత లేకుండా ఆవారాగా తిరిగే కొడుకు.. వీళ్ల మధ్య ఒక సంఘర్షణ.. ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలి జీవితంలో అన్నీ ప్రతికూలంగా మారిన స్థితిలో ఆ కొడుకులో మార్పు వచ్చి బాధ్యత తెలుసుకోవడం.. తాను గెలిచి తండ్రినీ గెలిపించడం.. ఈ తరహాలో ఎన్నో సార్లు చూసిన కథనే అతనూ చెప్పాడు. ఉన్నంతలో తెలిసిన కథనే కుదురుగా బాగానే చెప్పాడు. ప్రేక్షకులు తెరపై తమను చూసుకునేలా ప్రధాన పాత్రల్ని తీర్చిదిద్దడంలోనూ దర్శకుడికి మార్కులు పడతాయి. పాత్రల పరిచయం దగ్గర్నుంచి ప్రతి సన్నివేశంలోనూ ఒక సింప్లిసిటీ కనిపిస్తుంది ‘విజేత’లో. ప్రథమార్ధంలోని కొన్ని సన్నివేశాలు ఆహ్లాదకరంగానూ అనిపిస్తాయి. హీరో ఫ్రెండ్స్ బ్యాక్ మధ్య కామెడీ.. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ పర్వాలేదనిపిస్తాయి. ఒక దశ వరకు సినిమా వేగంగానే నడిచిపోతుంది.

కానీ అసలు కథ చెప్పాల్సి వచ్చినపుడే సమస్య. అందులో ఏ కొత్తదనం లేకపోయింది. బలమైన స్ట్రైకింగ్ పాయింట్ ఏమీ లేదు. ఈ కథ ఇలాగే ఉంటుంది అనే ప్రేక్షకుడి అంచనాకు తగ్గట్లే ‘విజేత’ సాగిపోవడంతో ఏ ఎగ్జైట్మెంట్ కనిపించదు. ఎలాంటి ఇమేజ్ లేని ఒక కొత్త హీరో సినిమా వైపు ప్రేక్షకుల్ని ఆకర్షించే బలమైన పాయింట్.. కొత్తదనం ఏమీ సినిమాలో లేకపోయింది. ప్రథమార్ధంలో కథతో పాటే సన్నివేశాలు సాగిపోతే.. ద్వితీయార్ధంలో మాత్రం సత్యం రాజేష్ తో ఒక కామెడీ ట్రాక్ పెట్టారు. అలాగే ఒక ఫైట్ జోడించారు. ఇలాంటివి కథను పక్కదోవ పట్టిస్తాయి. ఐతే ఎగుడుదిగుడుగా సాగే ద్వితీయార్ధం పతాక సన్నివేశానికి ముందు గాడిన పడుతుంది. ఎమోషనల్ గా సాగే చివరి పావుగంట ‘విజేత’కు ప్లస్. క్లైమాక్స్ కొంచెం డ్రమటిగ్గా అనిపించినా ఎమోషన్ బాగానే పండింది. సినిమా మొత్తంలో తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ఎమోషనల్ గా సాగే సగటు ఫ్యామిలీ డ్రామాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు ‘విజేత’ నచ్చొచ్చు. కొత్తదనం కోరుకుంటే మాత్రం నిరాశ తప్పదు.

నటీనటులు:

కొత్త హీరో కళ్యాణ్ దేవ్ జస్ట్ ఓకే అనిపిస్తాడు. నటన ప్రత్యేకంగా ఏమీ అనిపించదు. అలాగని తీసి పడేసేలా లేదు. ఒక సాధారణ కుర్రాడి పాత్రకు అతను సరిపోయాడు. కళ్యాణ్ కు పరీక్ష పెట్టే సన్నివేశాలేమీ సినిమాలో లేవు. నిజానికి హీరో కంటే కూడా అతడి తండ్రి పాత్రకే ప్రాధాన్యం ఎక్కువ. ఆ పాత్రలో మురళీ శర్మ అద్భుతంగా నటించాడు. ‘విజేత’లో అసలైన విజేత ఆయనే అని చెప్పాలి. ఈ సినిమా కళ్యాణ్ కంటే కూడా మురళీ శర్మకే ఎక్కువ ఉపయోగపడుతుంది. ఆయన ముందు కొన్నిసార్లు కళ్యాణ్ బలహీనతలు కనిపిస్తుంటాయి. మాళవిక నాయర్ లాంటి మంచి నటిని దర్శకుడు ఉపయోగించుకోలేదు. ఉన్నంతలో ఆమె బాగానే చేసినా ఆ పాత్రకు సినిమాలో సరైన ప్రాధాన్యం లేదు. హీరో స్నేహితులుగా సుదర్శన్.. మహేష్.. కిరీటి.. నోయల్.. బాగానే చేశారు. నాజర్ తక్కువ నిడివిలోనే తన ముద్ర చూపించారు. జయప్రకాష్.. ప్రగతి.. రాజీవ్ కనకాల.. ఆదర్శ్.. వీళ్లంతా పాత్రలకు తగ్గట్లుగా నటించారు.

సాంకేతికవర్గం:

‘విజేత’కు సాంకేతిక హంగులు బాగా కుదిరాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ పాటలు.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. కోడి పాటతో పాటు ప్రధమార్ధంలో వచ్చే రెండు పాటలూ బాగున్నాయి. ‘బాహుబలి’ కెమెరామన్ సెంథిల్ కుమార్.. ఈ చిన్న సినిమాలోనూ తన ప్రత్యేకత చూపించాడు. ఆయన కెమెరా సినిమాకు ఒక ప్లెజెంట్ లుక్ తీసుకొచ్చింది. నిర్మాణ విలువల విషయంలో సాయి కొర్రపాటి తన ప్రత్యేకత చాటుకున్నారు. సినిమా రిచ్ గా తెరకెక్కింది. ఇక కొత్త దర్శకుడు రాకేశ్ శశి.. పాత కథను తీసుకుని కొంచెం ఆహ్లాదకరంగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఎమోషనల్ సీన్ల వరకు అతను బాగా డీల్ చేశాడు. కథను చెప్పే విషయంలో సింప్లిసిటీ ఆకట్టుకుంటుంది. దర్శకుడిగా రాకేశ్ ప్రతిభ అక్కడక్కడా కనిపిస్తుంది కానీ.. కథాకథనాల విషయంలో కొత్తగా ఏమీ ట్రై చేయకపోవడం నిరాశ కలిగిస్తుంది.

చివరగా: విజేత.. పాత కథలో కొత్త హీరో

రేటింగ్- 2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre