Begin typing your search above and press return to search.

చియాన్ ఫ్లాపుల‌తో కేకేకి ఎన్ని చిక్కులు?

By:  Tupaki Desk   |   16 July 2019 6:35 AM GMT
చియాన్ ఫ్లాపుల‌తో కేకేకి ఎన్ని చిక్కులు?
X
వ‌రుస ప‌రాజ‌యాలు చియాన్ విక్ర‌మ్ మార్కెట్ ని దెబ్బ కొట్టిన సంగ‌తి తెలిసిందే. హిట్టును న‌మ్మే ప‌రిశ్ర‌మ‌లో ఆ ఒక్క‌టే కిక్కు. అది లేనిదే ఎంత గొప్ప సినిమా అయినా ప్రీరిలీజ్ బిజినెస్ చేయ‌డం క‌ష్టం. ప్ర‌స్తుతం అలాంటి క‌ష్టాన్నే ఎదుర్కొంటోంద‌ట `మిస్ట‌ర్ కేకే`. ఈ సినిమా పోస్ట‌ర్ల‌తోనే ఆస‌క్తిని క్రియేట్ చేయ‌గ‌లిగింది టీమ్. అలాగే ట్రైల‌ర్ ఆద్యంతం అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఎంతో గ్రిప్పింగ్ గా ఆక‌ట్టుకుంది. కానీ ఏం లాభం? మిస్ట‌ర్ కేకే బిజినెస్ అటు త‌మిళం.. ఇటు తెలుగు రెండు చోట్లా చెప్పుకోద‌గ్గ రేంజులో లేద‌ని తెలుస్తోంది.

ముఖ్యంగా చియాన్ విక్ర‌మ్ కి ఇటీవ‌ల తెలుగులో అస‌లు హిట్ట‌న్న‌దే లేదు. అప‌రిచితుడు- నాన్న త‌ర్వాత విక్ర‌మ్ న‌టించిన సినిమాలేవీ తెలుగు ఆడియెన్ మ‌న‌సుల్ని గెల‌వ‌లేక‌పోయాయి. కార‌ణం ఏదైనా ఆ ప్ర‌భావం కేకే తెలుగు రాష్ట్రాల ప్రీరిటీజ్ బిజినెస్ పైనా ప‌డింద‌ని తెలుస్తోంది. ఈనెల 19న (శుక్ర‌వారం) సినిమాని ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. అయినా తెలుగు నాట స‌రైన బిజినెస్ లేక‌పోవ‌డంపై ఫిలింన‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అస‌లు బిజినెస్ మాట అటుంచితే మిస్ట‌ర్ కేకేకి ప్ర‌మోష‌న్ అంతంత మాత్ర‌మే. నేడు హైద‌రాబాద్ లో చిత్ర క‌థానాయ‌కుడు విక్ర‌మ్ తో పాటు మూవీలో ఓ కీల‌క పాత్ర‌ను పోషించిన అక్ష‌ర హాస‌న్ తెలుగు మీడియాతో ఇంట‌రాక్ట్ అవుతున్నారు. అంటే కేవ‌లం రెండ్రోజుల ముందు ప్ర‌చారం ప్రారంభిస్తే ఏమేర‌కు జ‌నాల‌కు చేరువవుతుంది? అన్న చ‌ర్చా మీడియాలో సాగుతోంది. ఈ రోజుల్లో ఎంత గొప్ప సినిమా అయినా ప్ర‌చారం లేనిదే జ‌నాల‌కు చేరువ కావ‌డం లేదు. ఈ విష‌యంలో మిస్ట‌ర్ కేకే వెన‌క‌బ‌డ‌డం ట్రేడ్ ప‌రంగా ఇబ్బందిక‌ర‌మే.

మిస్ట‌ర్ కేకే కంటెంట్ ప‌రంగా ఎంతో ఇంట్రెస్టింగ్ మూవీనే. టైటిల్ పాత్ర పోషిస్తున్న చియాన్ విక్ర‌మ్ ఇందులో ఓ గ్యాంగ్ స్ట‌ర్ గా న‌టిస్తున్నారు. మ‌లేషియా అండ‌ర్ వ‌ర‌ల్డ్ ని శాసించే కేకేగా విశ్వ‌రూపం చూపించ‌బోతున్నాడు. ఇక ఈ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ కుమార్తె అక్ష‌ర హాస‌న్ ఓ ఫ్రెగ్నెంట్ పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. సీనియ‌ర్ న‌టుడు నాజ‌ర్ వార‌సుడు అభిహాస‌న్ ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు. ప్ర‌తిభావంతుడైన‌ రాజేష్ ఎం సెల్వ దర్శకత్వం వ‌హించ‌గా.. `కిల్లర్` నిర్మాతలు టి నరేష్‌కుమార్, టి శ్రీ‌ధ‌ర్‌లు (టి అంజయ్య సమర్పణ) తెలుగులో విడుదల చేస్తున్నారు. ట్యాలెంటెడ్ గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. శ్రీ‌నివాస్.ఆర్ గుప్తా లాంటి ప్ర‌తిభావంతుడు టాప్ క్లాస్ ఛాయాగ్ర‌హ‌ణం హై స్టాండార్డ్స్ లో ఆక‌ట్టుకోనుంద‌ని తెలుస్తోంది. ట్రైల‌ర్ తోనే ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండార్డ్ విజువ‌ల్స్ తో ఆక‌ట్టుకుంది. కానీ ఏం ప్ర‌యోజ‌నం? బిజినెస్ ప‌రంగా హైప్ తీసుకురావ‌డంలో యూనిట్ విఫ‌ల‌మైంద‌న్న టాక్ వినిపిస్తోంది. విక్ర‌మ్ గ‌త చిత్రాలు తెలుగులో పెద్దంత‌గా హిట్టు కాక‌పోవ‌డం డిస్ట్రిబ్యూష‌న్ వ‌ర్గాల్ని ఆలోచ‌న‌లో ప‌డేసింద‌ని చెబుతున్నారు.