Begin typing your search above and press return to search.

విక్రమ్ ‘ఐ’ కష్టాలు వింటే కన్నీళ్లే..

By:  Tupaki Desk   |   5 Sep 2016 10:30 PM GMT
విక్రమ్ ‘ఐ’ కష్టాలు వింటే కన్నీళ్లే..
X
నటన అంటే ప్రాణం అంటుంటారు చాలామంది. కానీ కొందరు నటులకే ఆ మాటలు సూటవుతాయి. అందులో విక్రమ్ పేరు కచ్చితంగా చేర్చాలి. హీరోగా అతణ్ని నిలబెట్టిన ‘సేతు’ నుంచి.. గత ఏడాది వచ్చిన ‘ఐ’ వరకు ఆయా పాత్రల కోసం మామూలు కష్టం పడలేదు విక్రమ్. ఇండియాలో మరే నటుడూ పాత్రల కోసం విక్రమ్ అంతలా కష్టపడి ఉండడంటే అతిశయోక్తి ఏమీ లేదు. అందులోనూ ‘ఐ’ సినిమా కోసమైతే ప్రాణం పెట్టాడు విక్రమ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ కష్టమేంటో విక్రమ్ చెప్పుకొచ్చాడు. అది వింటే కన్నీళ్లు రాకమానవు.

‘‘నా కెరీర్ లో నేను అత్యంత కష్టపడింది ‘ఐ’ సినిమాకే. అంత కష్టం ఇంత వరకు పడలేదు. ఇకముందూ పడననుకుంటున్నాను. మామూలుగా బాడీ బిల్డర్ కావాలంటే నెలలు.. సంవత్సరాలు పడుతుంది. ఓ పది నెలలైనా క్రమం తప్పకుండా కష్టపడితే తప్ప ఆ షేప్ రాదు. కానీ నేను మూడు నెలల్లోనే అది సాధించాను. రేయింబవళ్లు జిమ్ లోనే గడిపాను. ఐతే స్టెరాయిడ్స్ తీసుకోలేదు. వేరే మార్గాలేమీ వెతకలేదు. కష్టపడ్డానంతే. ఆ తర్వాత ఆ సినిమా కోసమే సగానికి సగం కావాల్సి వచ్చింది. సహజంగానే బరువు తగ్గాను. కడుపు మాడ్చుకున్నాను. ఫ్యాట్ బర్నర్ లాంటివేమీ వాడలేదు. ఈ సినిమాలో మోడల్ పాత్ర కూడా ఉంటుంది. దాని కోసం మరింత కష్టపడాల్సి వచ్చింది. బాడీ బిల్డర్ కావడానికి.. బక్క చిక్కి కనిపించడానికి మధ్యలో ఈ గెటప్ లోకి మారాను. ఐతే బాడీ బిల్డింగ్ చేయడం వల్ల ముఖం అంతా లోపలికి వెళ్లి ఛార్మ్ పోయింది. అయినా కష్టపడి మోడల్ లుక్ తెచ్చుకున్నాను. చాలాసార్లు శంకర్ సారే ఇంత కష్టం అవసరమా అన్నారు. అయినా నా తృప్తి కోసం అని చేశాను. మా ఇంట్లో వాళ్లయితే నేను బక్కచిక్కినపుడు నా ముఖం చూడటానికే ఇష్టపడలేదు’’ అని విక్రమ్ చెప్పాడు.