Begin typing your search above and press return to search.

మినీ రివ్యూ : 'విక్ర‌మ్ వేద‌'

By:  Tupaki Desk   |   2 Oct 2022 1:25 PM GMT
మినీ రివ్యూ : విక్ర‌మ్ వేద‌
X
బాలీవుడ్ స్టార్స్ గ‌త కొంత కాలంగా గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. కొత్త క‌థ‌లు, పీరియాడిక్ మూవీస్ చేసినా ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా న‌చ్చ‌డం లేదు. దీంతో చాలా వ‌ర‌కు ద‌క్షిణాది రీమేక్ ల వైపు చూస్తున్నారు. మ‌న సినిమాలు బాలీవుడ్ లో రికార్డులు సృష్టిస్తుండ‌టంతో క్రేజీ స్టార్స్ సైతం మ‌న సినిమాల రీమేక్ ల‌లో న‌టించ‌డానికే అధిక ప్రాధాన్య‌త నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో 2017లో మాధ‌వ‌న్‌, విజ‌య్ సేతుప‌తి తొలిసారి క‌లిసి న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `విక్ర‌మ్ వేద‌`. త‌మిళంలో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీని హిందీలో సైఫ్ అలీఖాన్‌, హృతిక్ రోష‌న్ ల‌తో పుష్క‌ర్ -గాయ‌త్రి రీమేక్ చేశారు. సెప్టెంబ‌ర్ 30న విడుద‌లైన ఈ మూవీ ఎలా వుంది? .. టీజ‌ర్ , ట్రైల‌ర్ తో భారీ హైప్ క్రియేట్ అయిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకుందా? లేదా అన్న‌ది ఇప్ప‌డు చూద్దాం.

విక్ర‌మ్ (సైఫ్ అలీఖాన్) నిజాయితీగ‌ల పోలీస్ ఆఫీస‌ర్‌. అండ‌ర్ గ్రౌండ్ కి వెళ్లిన పేరుమోసిన గ్యాంగ్ స్ట‌ర్ వేద (హృతిక్ రోష‌న్‌` ని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన టీమ్ లో భాగ‌మ‌వుతాడు. అయితే విక్ర‌మ్ టీమ్ ప్ర‌య‌త్నించ‌కుండానే వేద అందిరినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ తన ఇష్ట‌పూర్వ‌కంగానే లొంగిపోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించి విక్ర‌మ్ కు లొంగిపోతాడు. ఇది విక్ర‌మ్ ని తీవ్ర గంద‌ర‌గోళానికి గురిచేస్తుంది. వేద మైండ్ లో ఏముంది? ఏ ప్లాన్ ప్ర‌కారం లొంగిపోయాడు? .. ఏం చేయ‌బోతున్నాడు? అని ప‌లు ప్రశ్న‌ల‌తో విక్ర‌మ్ ఎక్కిరి బిక్కిరి అవుతాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? వేద ప్లాన్ ని విక్ర‌మ్ క‌నిపెట్టాడా? .. ఇంత‌కీ వేద త‌న‌కు తానుగా ఎందుకు లొంగిపోయాడు..ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌దే ఈ చిత్ర క‌థ.

సైఫ్ విక్ర‌మ్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు. అయితే మాతృక‌లో ఈ పాత్ర‌ని మాధ‌వ‌న్ కొంత సాఫ్ట్ గా చేస్తే సైఫ్ కొంత గంభీర‌త‌ని జోడించి త‌న‌దైప స్టైల్లో ర‌క్తిక‌ట్టించాడు. ఇక కొన్ని భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ మాధ‌వ‌న్ ని మ‌రిపించ‌డం విశేషం. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ గా విక్ర‌మ్ పాత్ర‌లో మాధ‌వ‌న్ కి మించిన అభిన‌యాన్ని క‌న‌బ‌రిచి సైఫ్ విక్ర‌మ్ పాత్ర‌ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు.

ఇక వేద పాత్ర‌ని త‌మిళ వెర్ష‌న్ లో విజ‌య్ సేతుప‌తి పోషించిన విష‌యం తెలిసిందే. ఆ పాత్ర‌ని హిందీలో హృతిక్ రోషన్ పోషించాడు. విజ‌య్ సేతుప‌తిని మించి ఈ సినిమాలో హృతిక్ వేద పాత్ర‌లో ఊర మాసీవ్ ప‌వ‌ర్ ఫుల్ లుక్ లో ఒదిగిపోయిన తీరు స‌గ‌టు ప్రేక్ష‌కుడిని విశేషంగా ఆక‌ట్టుకుంది. మాస్ అవ‌తార్ లో హృతిక్ రోష‌న్ ఔరా అనిపించాడు. గ్యాంగ్ స్ట‌ర్ వేద పాత్ర‌లో హృతిక్ ప‌లికించిన హావ‌భావాలు, మేకోవ‌ర్.. యాక్ష‌న్ ఘ‌ట్టాలు సినిమాకు ప్ర‌ధాన హైలైట్ లు గా నిలిచాయి. ద‌ర్శ‌కులు కూడా హృతిక్ పాత్ర త‌మిళ వెర్ష‌న్ తో పోలిస్తే మ‌రింత మాసీవ్ గా, మ‌రింత ప‌వర్ ఫుల్ మేకోవ‌ర్ తో వుండేలా చూసుకుని ఆ విష‌యంలో స‌క్సెస్ అయ్యారు.

పీఎస్ వినోద్ ఫొటొగ్ర‌ఫీ, సామ్ సీఎస్ బీజీఎమ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌, క్లైమాక్స్ టెర్రిఫిక్ గా కుదిరి ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీకి యునానిమ‌స్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ వ‌చ్చేసింది. అయితే ఆ స్థాయిలో బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్లు లేక‌పోవ‌డం కొంత ఇబ్బందిక‌ర విష‌యం. ఓవ‌రాల్ గా సినిమా గురించి చెప్పాలంటే `విక్రమ్ వేద‌` ఓ ప‌ర్ ఫెక్ట్ రీమేక్‌. ఒరిజిన‌ల్ ని మించి రీమేక్ ని రూపొందించార‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే టాక్ కి త‌గ్గ‌ట్టుగా వ‌సూళ్లు పెరిగి ఉత్త‌రాది ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తే ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.