Begin typing your search above and press return to search.

సుదీప్ బర్త్ డే స్పెషల్ గా 'విక్రాంత్ రోణ' ఫస్ట్ గ్లిమ్స్..!

By:  Tupaki Desk   |   2 Sep 2021 1:30 PM GMT
సుదీప్ బర్త్ డే స్పెషల్ గా విక్రాంత్ రోణ ఫస్ట్ గ్లిమ్స్..!
X
'ఈగ' 'బాహుబలి' 'రక్తచరిత్ర' వంటి చిత్రాలలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. విలక్షణమైన నటనతో ఇక్కడ కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న సుదీప్.. ఇప్పుడు ''విక్రాంత్ రోణ'' అనే ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. త్రీడీ టెక్నాలజీలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 14 భాష‌ల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజు శుక్రవారం శాండిల్ వుడ్ బాద్ షా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా డెడ్ మ్యాన్ ఆంథమ్ పేరుతో ఫస్ట్ గ్లిమ్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

''విక్రాంత్ రోణ'' ఫస్ట్ గ్లిమ్స్ చూస్తుంటే అత్యున్నత సాంకేతిక విలువలతో హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు అర్థం అవుతోంది. ఒక చిన్నపాప ఓ కథ చెప్పడంతో ప్రారంభమైన ఈ వీడియో సుదీప్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. బ్యాంగ్ బ్యాంగ్ అంటూ తనదైన శైలి యాక్షన్ తో సుదీప్ అలరిస్తున్నారు. ఇందులో విజువల్స్ హాలీవుడ్ సినిమాలను గుర్తు చేస్తున్నాయి. ఈ స్మాల్ వీడియో సినిమాపై అంచనాలు పెంచిస్తోంది. ప్రస్తుతం ఈ గ్లిమ్స్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

'విక్రాంత్ రోణ' చిత్రానికి అనూప్ భండారి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఇందులో సుదీప్ సరసన నీతా అశోక్‌ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో కనిపించనుంది. నిరూప్ భండారి - రవిశంకర్ గౌడ - మధుసూదన్ రావు - వాసుకి వైభవ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి బి. అజనీశ్ లోక్ నాథ్ సంగీతం సమకూర్చారు. విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. 'కేజీయఫ్' ఫేమ్ శివకుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. జాక్ మంజునాథ్ - షాలిని మంజునాథ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అలంకార్ పాండియ‌న్‌ స‌హ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 19న ''విక్రాంత్‌ రోణా'' చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగినట్లు తెలుస్తోంది. హిందీ ఆడియో రైట్స్ ను టీ-సీరిస్ సంస్థ సొంతం చేసుకోగా.. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల ఆడియో హక్కుల్ని లహరి సంస్థ దక్కించుకుంది. భారతీయ సినీ ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీపై క్లారిటీ రానుంది.